LOKABHIRAMA RIDES KALPA VRIKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై శ్రీరాముని కటాక్షం
Tirupati, 19 March 2018: On the fourth day morning, Lord Sri Kodanda Rama blessed His devotees on Kalpavriksha Vahanam as a part of ongoing annual brahmotsavams.
The devotees were mused by the very sight of Sri Rama on the divine tree-Kalpavriksha Vahanam. After the vahana seva, the deities were rendered Snapana Tirumanjanam. In the evening Unjal Seva was performed.
DyEO Smt Jhansi, Executive Engineer Sri Jagadeeswara Reddy, AVSO Sri Ganga Raju, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై శ్రీరాముని కటాక్షం
మార్చి 19, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. భజనలు, కోలాటాల నడుమ స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.
ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవ క్షం. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరిన ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు.
వాహనసేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
సర్వభూపాల వాహనం :
సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు. అందుకే సర్వభూపాలురు వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కంధాలపై ఉంచుకుని విహరింప చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, డెప్యూటీ ఈవో శ్రీ ఇసి.శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీ మునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీశేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
మార్చి 20న గరుడసేవ సందర్భంగా రాములవారి పాదాల ఊరేగింపు :
తిరుపతిలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీరామచంద్రమూర్తి పాదాలను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఉరేగించి రాత్రి జరుగనున్న గరుడసేవలో అలంకరిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.