KALYANA VENKANNA RIDES SURYA PRABHA VAHANAM_ సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ప్రకాశం

Tirupati, 12 February 2018: On Day 7 of Annual Brahmotsvam of Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram, Lord Venkanna rode on Surya Prabha Vahanam as Govardhanagiridhari avatar.

Caparisoned elephants teams of chakka bhajan, Kolata artists accompanied by drums and bhakti music charmed the devotees offering camphor harati all the way.

Later in the day Snapana Tirumanjanam was performed for the ustava idols of Venkanna and his consorts Sri Devi and Bhudevi with milk, curd, honey, sandal, coconut water.

The lord will also be offered grand Unjal seva in the evening before the celestial Chandraprabha vahanam.

Local Temple DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu, Exe Engineer Sri Manohan, DyEE Sri Ramamurthy, Chief Kankana Bhattar Sri Balaji Rangacharyulu, AE Sri Nagaraju, AVSO Sri Ganga Raju and others participated.

RATHOTSAVAM ON FEB 13

On Day 8 of the Sri Kalyana Venkateswara Swamy Brahmotsavams, Rathotsavam will be performed on February 13 in the morning along the mada streets. Later at night Venkanna will ride on Aswa Vahanam,


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ప్రకాశం

తిరుపతి,2018 ఫిబ్రవరి 12: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిదారుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం కల్యాణ సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిస్తాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఓషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే కల్యాణ సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

వాహన సేవ అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్ళతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

చంద్రప్రభ వాహనం :

రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం. పాపహరం.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, డిప్యూటి ఇఇ శ్రీ రామూర్తి, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, ఏఈ శ్రీ నాగరాజు, ఎవిఎస్వో శ్రీ గంగారాజు, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఫిబ్రవరి 13న రథోత్సవం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.00 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 8.15 నుండి 9.15 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.