KODANDA RAMA TEPPOTSAVAMS CONCLUDES _ ఘ‌నంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు

TIRUPATI, 16 APRIL 2022: Sri Kodanda Rama Swamy Teppotsavams concluded on Saturday evening.

 

The celestial annual float festival witnessed a good turnout of devotees.

 

Deputy EO Smt Nagaratna and others were present.

ఘ‌నంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు

తిరుప‌తి, 2022 ఏప్రిల్ 16: తిరుపతిలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాలు శ‌నివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్ళతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఆ త‌రువాత ఉత్సవర్లకు సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.

అనంతరం సాయంత్రం శ్రీ‌ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. విద్యుద్దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెప్పోత్సవం అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.