శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి, 2018 జనవరి 02: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని ముఖమండపంలో ఉదయం 9.00 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జనవరి 3న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 3వ తేదీ బుధవారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.

శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో జనవరిలో విశేష ఉత్సవాలు

– జనవరి 6, 13, 20వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు.

– జనవరి 16న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.