జూన్ 24న అమావాస్యనాడు శ్రీకోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ
జూన్ 24న అమావాస్యనాడు శ్రీకోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ
తిరుపతి, 2017 జూన్ 23: తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో జూన్ 24వ తేదీ శనివారం అమావాస్యనాడు సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం నాడు మూలవర్లకు నిర్వహించే అభిషేకంను ఉదయం 4.30 గంటలకు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.
సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల నడుమ హనుమంత వాహనసేవ జరుగనుంది. హనుమంతుడిని ‘సంకట మోచన’గా పిలుస్తారు. అనగా దుష్టశక్తులను నశింపజేసి చెడు ఆలోచనలను దూరం చేస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రం తదితర పర్వదినాలకు చాలా విశిష్టత ఉంటుంది.
జూన్ 25న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూన్ 25వ తేదీ ఆదివారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.
శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.