KOIL ALWAR TIRUMANJANAM PERFORMED IN SKVST_ శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Srinivasa Mangapuram, 12 July 2018: The Koil Alwar Tirumanjanam fete was performed in Srinivasa Mangapuram on Thursday in connection with annual Sakshatkara Vaibhavotsavam from July 16-18.

The temple was cleansed with Parimalam and the fete was.observed from 6am to 11.30am.

Paruveta Utsavam will be observed on July 19.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2018 జూలై 12: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 16 నుండి 18వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించారు. ఉదయం 7 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కారణంగా గురువారం తిరుప్పావడసేవ, కల్యాణోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జూలై 16 నుండి 18వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి నిర్వహించే సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 16 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

ఈ మూడు రోజుల పాటు ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి ఊరేగింపులో భాగంగా మొదటిరోజైన సోమవారం తిరుచ్చి, రెండో రోజైన మంగళవారం హనుమంత వాహనం, మూడో రోజైన బుధవారం గరుడ వాహనసేవలు చేపడతారు.

జూలై 19న పార్వేట ఉత్సవం :

సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 19వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా జరుగనుంది. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు :

సాక్షాత్కార వైభవోత్సవాల కారణంగా జూలై 16 నుండి 18వ తేదీ వరకు కల్యాణోత్సవం, జూలై 17న స్వర్ణపుష్పార్చన, జూలై 18న అష్టోత్తర శతకళశాభిషేకం, జూలై 19న తిరుప్పావడ సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.