KOIL ALWAR TIRUMANJANAM PERFORMED IN TIRUMALA TEMPLE_ శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 16 Jul. 19: In view, the traditional annual budget festival of Tirumala temple Anivara Asthanam on Wednesday, temple cleansing fete Koil Alwar Tirumanjanam was observed on Tuesday.

The entire temple was cleansed with Parimalam mixture which was smeared on walls, ceilings of main and sub-shrines located in Tirumala temple. All puja utensils were also cleansed and later positioned in their respective places.

Speaking on the occasion, TTD Chairman Sri YV Subba Reddy said that this fete would be observed four times in a year before Vaikuntha Ekadasi, Anivara Asthanam, annual Brahmotsavams and Ugadi.

Later TTD EO said, the pilgrims will be allowed on Tuesday for darshan between 12noon and 5 pm as the temple closes by 7 pm in view of Chandra Grahanam. “Even on Wednesday owing to Anivara Asthanam, the darshan will commence only after 11 am. Food packets will be distributed from 3 pm to 7 pm and Annaprasadam reopens only on Wednesday after 9 am. We have already appealed to pilgrims to plan their pilgrimage accordingly to Tirumala on Tuesday and Wednesday to avoid any sort of inconvenience in view of Chandragrahanam and limited hours of darshan”, he added.

Special Officer Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2019 జూలై 16: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారంనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని తెలియచేశారు. సంవత్సరంలో నాలుగు ప‌ర్వ‌దినాలైన ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. తిరుమంజ‌నం అనంత‌రం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు తెలియచేశారు.

అనంత‌రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్ మాట్లాడుతూ ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారన్నారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచామన్నారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు.

జూలై 17వ తేదీ బుధ‌వారం ఉద‌యాత్పూర్వం 1.31 గంట‌ల‌కు చంద్రగ్రహణం ప్రారంభ‌మై ఉద‌యం 4.29 గంట‌లకు పూర్తవుతుంద‌న్నారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ అన్నారు. చంద్రగ్రహణం కార‌ణంగా మంగ‌ళ‌వారం రాత్రి 7.00 గంటల నుండి 17వ తేదీ బుధ‌వారంవారం ఉదయం 9.00 గంటల వరకు తిరుమలలోని అన్నప్రసాదాల వితరణ కేంద్రాలను మూసివేయనున్నాట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముదస్తుగా టిటిడి అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 20 వేల పులిహోర, టమోట అన్నం ప్యాకెట్లను సాయంత్రం 3.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు పంపీణి చేయనున్నాట్లు తెలియ‌జేశారు.

శ్రీ‌వారి ఆల‌యంలో బుధ‌వారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. అనంత‌రం ఉద‌యం 9.00 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు ఆణివార ఆస్థానం వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. త‌దుప‌రి ఉదయం 11.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంద‌న్నారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నంతోపాటు చంద్రగ్రహణం కారణంగా అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌, వ‌సంతోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లు టిటిడి ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఏ.వి. ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, పేష్కర్‌ శ్రీ లోక‌నాథం, ఆల‌య ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.