KSHEERADHIVASAM OBSERVED _ సీతంపేటలో ఆగమోక్తంగా క్షీరాధివాసం

TIRUPATI, 02 MAY 2023: The Mahasamprokshanam rituals on Tuesday witnessed Ksheeradhivasam at Sri Venkateswara Swamy temple in Seetampeta of Manyam district.

On May 3, Vimana Kalasa Sthapana, Vigraha Pratista will be observed between 8am and 12noon. On May 4, Maha Samprokshanam and Kalyanotsavam will be observed.

The cultural programmes including Kolatam and Bhajana have been attracting devotees to a great extent.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సీతంపేటలో ఆగమోక్తంగా క్షీరాధివాసం

– మే 3న విగ్రహప్రతిష్ట, మే 4న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం

– ఆకట్టుకున్న భజన కార్యక్రమాలు

సీతంపేట, 2023, మే 02: పార్వతీపురం మన్యం జిల్లా  సీతంపేటలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఆగమోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ ఉపద్రష్ట, టీటీడీ వైఖానస ఆగమసలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ మంగళవారం ఉదయం బింబశుద్ధి కోసం క్షీరాధివాసం నిర్వహించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలను గోవు పాలతో అభిషేకం చేశామని వివరించారు. అదేవిధంగా ఆలయ విమానగోపురం, ధ్వజస్తంభాలను అద్దంలో చూపి పాలతో అభిషేకం చేశారు. అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.

మే 3న విగ్రహప్రతిష్ట, మే 4న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం

మే 3న ఉదయం 8 నుండి 12 గంటల మధ్య విమాన కలశ స్థాపన, బింబస్థాపన (విగ్రహప్రతిష్ట) నిర్వహిస్తారు.

మే 4న ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. స్వామివారి కల్యాణోత్సవానికి పరిసర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తుల కోసం టీటీడీ
అవసరమైన ఏర్పాట్లు చేసింది.

ఈ కార్యక్రమంలో కంకణభట్టార్ శ్రీ శేషాచార్యులు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, ఈఈ శ్రీ సుధాకర్, ఏఈఓ శ్రీ రమేష్, డెప్యూటీ ఈఈ లు శ్రీ ఆనందరావు, శ్రీ నాగరాజు, జేఈ శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న భజన, కోలాట కార్యక్రమాలు

సీతంపేటలోని ఆలయం వద్ద గల వేదికపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. గిరిజన ప్రాంతాల నుంచి భజన బృందాలు కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా ప్రచార రథం ద్వారా సీతంపేట పరిసర గ్రామాల్లో ఆలయ మహాసంప్రోక్షణ గురించి భక్తులకు తెలియజేసేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం బలద గ్రామం నుంచి శ్రీ రామలింగేశ్వర భజన బృందం, పాలకొండ నుంచి శ్రీ సంపత్ వినాయక బృందం, సింగన్నవలస నుంచి శ్రీ సీతారామ భజన బృందం, తుమరాడ నుంచి శ్రీ వేంకటేశ్వర బృందం నామసంకీర్తన, చెక్కభజన చేశారు. అదేవిధంగా బొబ్బిలి నుంచి శ్రీ సీతారామ భజన బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. సూపరింటెండెంట్
శ్రీ చంద్రమౌళీశ్వర శర్మ, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి లలితామణి ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.