జూలై 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

జూలై 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2017 జూలై 02: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు జూలై 4న అంకురార్పణ నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పౌర్ణమి ముందున్న చతుర్దశి నాటికి పూర్తయ్యేలా మూడు రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు. జూలై 5వ తేదీ ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు పంచమూర్తులైన శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షమ్మ అమ్మవారు, శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీచండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు. జూలై 6వ తేదీ గ్రంథి పవిత్ర సమర్పణ చేస్తారు. జూలై 7వ తేదీ మహాపూర్ణాహుతి, సాయంత్రం 6.30 గంటలకు పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ పవిత్రోత్సవంను ఆర్జితం సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గ హస్థులు పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గ హస్తులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరి రోజు పవిత్రమాల బహుమానంగా అందజేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.