వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర కల్యాణవెంకన్నకు బంగారు అశ్వ‌త్థ ప‌త్ర హార‌ము, బంగారు పాగ‌డ బ‌హూక‌ర‌ణ‌

వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర కల్యాణవెంకన్నకు బంగారు అశ్వ‌త్థ ప‌త్ర హార‌ము, బంగారు పాగ‌డ బ‌హూక‌ర‌ణ‌

తిరుపతి, 2019 ఫిబ్రవరి 28: తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర గురువారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాల్లో బ్రహ్మూెత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా గరుడసేవ నాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి 2.9 కిలోల బరువు గల ఈ ఆభరణాలను బ‌హూక‌రించిన‌ట్లు తెలిపారు. ఇందులో 1.1 కేజిల బంగారు అశ్వ‌త్థ ప‌త్ర హార‌ము, 1.8 కేజిల బంగారు పాగ‌డ కానుకగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అందిస్తున్నట్టు వెల్లడించారు. శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో టిటిడి రూ. 7 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టింద‌న్నారు. ఇటీవ‌ల రాష్ట్ర ఆర్కియాల‌జి విభాగం క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి వాణి మోహ‌న్ స్వామివారి ఆల‌యాన్ని ప‌రిశీలించి నూత‌న పోటు, ఉగ్రాణం నిర్మాణానికి సిఫార‌స్సు చేసిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో మ‌రో రూ.5 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం, ఆభరణాలను తిరుమల శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, పెష్కార్ శ్రీ ర‌మేష్‌బాబు, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనానికి తీసుకొచ్చారు.

ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీనివాసమంగాపురం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది