LAUNCHING OF “SADACHARAM PROGRAMME” _ ఘనంగా ‘సదాచారం’ శిక్షణ తరగతులు ప్రారంభం
ఘనంగా ‘సదాచారం’ శిక్షణ తరగతులు ప్రారంభం
తిరుపతి, 2012 అక్టోబరు 2: విద్యార్థినీ విద్యార్థులకు హిందూ సనాతన ధర్మం, నైతిక విలువలు, సంప్రదాయాల్లోని శాస్త్రీయత తదితర అంశాలను బోధించేందుకు ”సదాచారం” పేరిట మంగళవారం ఏకకాలంలో తితిదే ఆధ్వర్యంలోని ఏడు పాఠశాలల్లో శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రారంభ కార్యక్రమంలో వక్తలు ‘గాంధీ మార్గం’ అనే అంశాన్ని విద్యార్థులకు బోధించారు. ఈ శిక్షణ తరగతుల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథిదేవోభవ, ఆచార్యదేవోభవ, పరోపకారం, సమయపాలన, మానవీయమర్యాదలు, మహర్షుల జీవితచరిత్రలు, ఇష్టపడి చదవడం, దయ, అహింస లాంటి అంశాలను వారానికి ఒక రోజు గంట పాటు విద్యార్థులకు బోధించనున్నారు.
శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో….
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో జరిగిన ”సదాచారం” ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ జాతిపిత గాంధీజీ సదాచారాలను పాటించడం వల్లనే మహాత్ముడయ్యాడని తెలిపారు. భారతీయ సమాజంలో తల్లిదండ్రులకు, గురువులకు విశిష్టమైన స్థానం ఉందని, విద్యార్థులు దాన్ని గుర్తెరిగి నడుచుకోవాలన్నారు. ఇలాంటి శిక్షణ తరగతుల ద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు, గురువులకు మంచిపేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఈఓ విద్యార్థులకు నీతి, విలువలు, జాతిపితకు సంబంధించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
ఈ కార్యక్రమంలో తితిదే ఎడిటర్ ఇన్ చీఫ్ ఆచార్య రవ్వా శ్రీహరి, తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాధ్, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణరాజు, విద్యా విభాగం డెప్యూటీ ఈఓ శ్రీమతి పార్వతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాలలో..
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాలలో జరిగిన ”సదాచారం” ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ప్రసంగిస్తూ విద్యార్థులు భావిభారత పౌరులుగా తయారయ్యేందుకు విద్యతోపాటు, సంస్కారవంతమైన జీవితం, మానవీయ విలువలు అవసరమన్నారు. ప్రహ్లాద చరిత్ర, దృవచరిత్ర, ధర్మవ్యధుడు వంటివారి చరిత్రలు విద్యార్థులకు తెలియజెప్పక పోవడం వల్ల నేటి యువతలో మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయన్నారు. దీనికితోడు యాంతిక జీవనానికి అలవాటు పడిపోయిన తల్లిదండ్రులు విద్యార్థులకు సదాచారాలను బోధించేందుకు సమయం కేటాయించడం లేదన్నారు. ”సదాచారం” పేరుతో తితిదే ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కుటుంబ, సమాజ, దేశ పురోభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వక్త ప్రొఫెసర్ హెచ్.ఎస్.బ్రహ్మానంద ప్రసంగిస్తూ భవిష్యత్ భారతదేశానికి సచ్చీలురైన పౌరులను అందించడంలో భాగంగా ఈ మహత్ కార్యానికి తితిదే నడుం బిగించడం ముదావహమన్నారు. ధార్మికతకు ఏ విధంగానైతే తిరుపతి నుండి బీజం పడిందో, అదేవిధంగా ఉన్నతమైన పౌరులను దేశానికి అందించడంలో భాగంగా ఈ సదాచారం కార్యక్రమానికి తిరుపతిలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం వెనక ఒక అద్భుతమైన ఆలోచన ఉందన్నారు. సదాచారానికి మారుపేరు, మరోరూపం గాంధీ మహాత్ముడని, సత్యం, అహింస, ధర్మం, ప్రేమ అనే నాలుగు అంశాలనే తన అస్త్రాలుగా మలచుకుని మహాత్మునిగా విశ్వవిఖ్యాతి పొందారని ఆయన అన్నారు.
శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాలలో..
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాలలో జరిగిన ”సదాచారం” ప్రారంభ కార్యక్రమానికి తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ నేటి విద్యార్థులపై వివిధ రకాల సంస్కృతుల ప్రభావం పడుతోందని, అలాంటి వారిలో ఈ కార్యక్రమం నైతిక సామర్థ్యాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.
వక్త ఆచార్య సర్వోత్తమరావు ప్రసంగిస్తూ గాంధీ భారతీయత తెలిసిన వ్యక్తి అన్నారు. భారతీయతలో ఆధ్యాత్మికత మెండుగా ఉంటుందన్నారు. శాకాహారం, ఐకమత్యం, మద్యనిషేధం వంటి కొన్ని గాంధీ సిద్ధాంతాలను అలవరుచుకోవాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.
శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాలలో..
తిరుపతిలోని శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాలలో జరిగిన ”సదాచారం” ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తితిదే ఇన్‌ఛార్జ్ విద్యాశాఖాధికారి శ్రీమతి సూర్యకుమారి విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంచి నడవడిక మనకు కనిపించని అలంకారం లాంటిదన్నారు. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు మంచి మార్కులు ఇస్తే , ”సదాచారం” పాఠాలు మంచి జీవితాన్ని ఇస్తాయన్నారు.
తితిదే నియామకాల విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి చెంచులక్ష్మి ప్రసంగిస్తూ జీవితంలో ఎలాంటి విలువలు పెంపొందించుకోవాలి, తల్లిదండ్రులకు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనే విషయాలను ఈ శిక్షణ తరగతుల్లో నిష్ణాతులైన పండితులు విద్యార్థులకు బోధిస్తారని తెలిపారు.
వక్త శ్రీ సముద్రాల థరథ్ ప్రసంగిస్తూ విద్యార్థులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. తనకెదురైన కష్టాలను, అవమానాలను దీటుగా ఎదుర్కొని ప్రపంచంలోనే ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. అనంతరం గాంధీ జీవితంలోని పలు స్వాతంత్య్ర పోరాట థలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సరళాదేవి, హిందూ ధర్మప్రచార పరిషత్ సూపరింటెండెంట్ శ్రీ పి.పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే తాటితోపులోని శ్రీ కపిలేశ్వరస్వామి ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా, డాక్టర్ చెన్నకేశవులునాయుడు వక్తగా హాజరయ్యారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్ ఇంజినీరు శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి వక్తగా పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.