LEAVE EGO, GREED, SELFISHNESS AND SERVE PILGRIMS _ నిస్వార్థ, నిరంహకార, నిరాడంబరంగా శ్రీవారి భక్తులకు సేవలందించాలి : శ్రీ సత్యసాయి సేవా సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వెంకట్రావ్
నిస్వార్థ, నిరంహకార, నిరాడంబరంగా శ్రీవారి భక్తులకు సేవలందించాలి : శ్రీ సత్యసాయి సేవా సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వెంకట్రావ్
తిరుమల, 2020 జనవరి 23: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు నిస్వార్థంగా, నిరాడంబరంగా, అహంకార రహితంగా సేవలందించాలని శ్రీ సత్యసాయి సేవా సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వెంకట్రావ్ ఉద్ఘాటించారు. తిరుమలలోని సేవాసదన్‌లో గురువారం ఉదయం జరిగిన సత్సంగంలో శ్రీవారి సేవకులను ఉద్ధేశించి ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ఒక క్షణ కాలం పాటు శ్రీవారిని దర్శిస్తే జన్మ తరిస్తుందనే తరుణంలో శ్రీవారి సేవకులు 7 రోజుల పాటు స్వామివారి క్షేత్రంలో ఉండి భక్తులకు సేవలు అందించడం పూర్వ జన్మ సుకృతమన్నారు. శ్రీవారి సేవకులు ఇదే సేవా దృక్పథంతో తమ తమ ప్రాంతాలకు వెళ్లిన తర్వాత కూడా స్వచ్ఛందంగా సేవలందించాలని కోరారు. శ్రీవారి సేవకులు సత్సంగం కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మరింత ఆధ్యాత్మిక శక్తి మంతులై భక్తులకు విశేషంగా సేవలందించగలరని తెలిపారు.
అంతకుముందు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి నుండి విచ్చేసిన సత్యసాయి సేవా బృందంతో భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి సేవ యొక్క పూర్వాపరాలను శ్రీవారి సేవ విభాగాధిపతి డా..టి.రవి వివరించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రజా సంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఏఈవో శ్రీ రమేష్, ఎవిఎస్వో శ్రీ వీరబాబు, ఏఈ శ్రీ వరప్రసాద్, శ్రీ సత్యసాయి సేవా సంస్థ తెలంగాణ రాష్ట్ర కో – అర్డినేటర్ శ్రీ హరిహరన్, ఇతర సిబ్బంది, విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.