“LET US FOLLOW THE PATH OF OUR GREAT LEADERS AND SANCTIFY OUR LIVES”-TTD EO _ తితిదే పరిపాలనా భవనంలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకలు

TIRUPATI, JAN 26:   The TTD EO Sri LV Subramanyam called upon the employees, youth, students to sanctify their lives by following the foot steps of the great leaders who sacrificed their lives in achieving an Independent, Republican country.

Addressing the 64 Republic Day celebrations that was being observed with grandeur in the parade grounds behind TTD administrative building in Tirupati on Saturday, the EO, quoted national heroes including Bhagat Singh, Azad, Gandhiji, Jhansi, Nehru, Netaji, Swamy Vivekananda, Gurajada Appa Rao and many more, for the fruits of
independence which they have given by sacrificing their lives. “It becomes our first and foremost responsibility and duty to follow the path shown by these great lives and sustain the fruits of independence by discharging our duties and responsibilities with utmost disciplene, devotion and dedication in this Republican country”, he added.

Later the cultural programmes caught the attention of every one with their awesome themes including Ganesha Dandakam, Venkateswara Nrityakriti, Sainik Dance Theme, Karate performance, micro-art display on seeds of rice, tamarind etc.

TTD EO Sri LV Subramanyam along with local MP Dr Chinta Mohan appreciated the karate stunts potrayed by the girls of SPW Degree college under the able guidance of master Sri PV Ananda Rao, who is an employee in TTD. They also lauded the micro-artisan skills of Sri P Chiranjeevi, son of sanitory inspector of TTD Sri P Rosaiah who
created the images of national leaders and mythological characters with his miniature art on seeds.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri GVG Ashok Kumar and other officers of TTD were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తితిదే పరిపాలనా భవనంలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకలు

తిరుపతి, జనవరి 26, 2013: తితిదే ఆధ్వర్యంలో శనివారం నాడు తిరుపతిలోని పరిపాలనా భవనం ప్రాంగణంలో జరిగిన 64వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విశేషంగా అలరించాయి.
 
జాతీయతను, ఆధ్యాత్మికతను ప్రబోధించే సంగీత, నృత్య ప్రదర్శనలే కాకుండా కరాటే విన్యాసాలు, సైనిక కవాతు, బియ్యపు గింజలపై జాతీయ నాయకుల చిత్రాల ప్రదర్శన మొదలైన కార్యక్రమాలు ఆహూతులను ఆద్యంతం రక్తి కట్టించాయి.
 
గణేశ స్తోత్రంతో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలలో విద్యార్థినీ విద్యార్థులు అద్భుత పాటవాలను కనబరిచి తితిదే ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.
ముఖ్యంగా తితిదేలో సహాయకుడుగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీ పి.ఎస్‌.ఆనందరావు నేతృత్వంలో 14 మంది శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు కరాటేలో శిక్షణ పొంది మహిళలు ఆత్మరక్షణ కోసం చేయవలసిన విన్యాసాలను, మెళకువలను ఎంతో అద్భుతంగా ప్రదర్శించి ఆహూతులను అబ్బురపరిచారు. అందులోభాగంగా వారు అప్పర్‌ పంచ్‌, లోయర్‌ పంచ్‌, మిడిల్‌ పంచ్‌, కర్రసాము, అగ్నిగోళం నుండి దూకే విన్యాసాలు వంటివి ప్రదర్శించి అలరించారు.
 
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సైనిక సంగీత కవాతు అహూతులను విశేషంగా ఆకట్టుకుంది. అటు తరువాత శ్రీవారి వైభవాన్ని తెలిపే రీతిలో ప్రదర్శించిన నృత్యరూపకం కూడా అలరించింది.
 
తితిదే పారిశుద్ధ్య విభాగంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పల్లి రోశయ్య కుమారుడు పల్లి చిరంజీవి తన ప్రతిభా పాటవాలతో సపోటా, చింత, ఉద్ది, బియ్యపు గింజలపై వేసిన జాతీయ నాయకులు, దేవతామూర్తుల చిత్తరువులతో ఏర్పాటుచేసిన ప్రదర్శన ప్రతి ఒక్కరినీ అద్భుతాశ్చర్యాలకు లోనుచేసింది. బియ్యపు గింజపై భరతమాత, భగత్‌సింగ్‌, గాంధీజీ, నెహ్రూ, నేతాజీ వంటి అనేక దేశ నాయకుల బొమ్మలు, సపోటా గింజపై వేమన, ఛత్రపతి శివాజీ, వీరేశలింగం పంతులు మొదలైన మహనీయుల చిత్రాలు వంటివి 50కి పైగా ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి.
 
తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, స్థానిక ఎంపీ డాక్టర్‌ చింతామోహన్‌, తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తదితర అధికారులు మైక్రో ఆర్ట్‌(సూక్ష్మ కళ)గా పిలవబడే ఈ  చిత్రలేఖనంలో అద్భుత ప్రావీణ్యం కనబరిచిన చిరంజీవిని ప్రశంసించారు.
    
తితిదే ఈవో గణతంత్ర దినోత్సవ ప్రసంగ పాఠం

”వేంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన,
వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి”
ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో విధుల్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తున్న సిబ్బందికి, శ్రీస్వామిసేవలో తరించి, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు, భావిభారతనిర్మాతలైన విద్యార్థినీవిద్యార్థులకు, దేవస్థానం పాలకమండలివారికి,  శ్రీవారిభక్తిపారవశ్యంలో పునీతులౌతున్న భక్తులకు, శ్రీవారి సేవకులకు 64వ గణతంత్ర దినోత్సవ శుభసందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ఎందరో వీరుల త్యాగఫలంగా, ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఈ గణతంత్రం సిద్ధించింది. ఈ శుభదినాన ఆ మహానుభావులందరినీ స్మరించుకోవడం మనబాధ్యత. కనీస ధర్మం.
భారతరాజ్యాంగానికి దేశంలోని ప్రతివ్యక్తీ స్ఫూర్తే. దేశం మహోన్నతమైన ప్రజాస్వామ్య రాజ్యంగా భాసిస్తూ ఒక దర్పణంగా ప్రపంచమంతటా ప్రతిఫలిస్తున్నది.
ఆర్ష సంస్కృతికి ఆలవాలమైన ఈ పుణ్యభూమిలో జన్మించడం, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి గొప్ప ధార్మికసంస్థలో పనిచేయడం మనందరి పూర్వజన్మ సుకృతం.
– జననీజన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి! అని పెద్దల వాక్యం. కనుక తాను నివసిస్తున్న భూమినీ, కన్నతల్లినీ స్వర్గంకంటే మిన్నగా భావించాలి.
– ”ఉత్తరం యత్‌ సముథ్చ్రైవ హిమాథ్చ్రైవ దక్షిణాం
వర్షం తత్‌ భరతం నామం భారతీ యత్ర సంతతిః”  
అని ఎంతో గొప్పగా భారతీయులు ప్రస్తుతించే సువిశాలమైన భారతదేశం మనది. రత్నగర్భయైన భారతీ దేవి సంతానంగా భాసిల్లుతున్న మనమందరం భారతీయులం.
– స్వతంత్ర దేశంలో ప్రతి ఒక్క పౌరునికీ ఉండవలసిన లక్షణం దేశభక్తి. అంటే కేవలం దేశాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, దేశ ప్రజలను ప్రేమించడం, దేశ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం. దేశ సమస్యలను తన సమస్యలుగా భావించి నిస్వార్థ బుద్ధితో కృషి చేయడం.
– ”దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌
   వట్టి మాటలు కట్టి పెట్టోయ్‌ గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌” అన్న గురజాడ ప్రబోధం      సర్వకాలాల్లో ఆచరణీయం.
– ప్రతి మానవుడు మానసికంగా ఎప్పుడూ స్వతంత్రుడే. భౌతిక జీవనవిధానంలో,  సామాజిక సంప్రదాయాల్లో, పరిపాలన విధానాల్లో మాత్రమే కట్టుబాట్లు, విధివిధానాలు ఉంటాయి. ఈ స్వేచ్ఛను పరదేశీయులు హరించినందువల్లనే స్వాతంత్య్రేచ్ఛ భారతీయుల్లో రగిలి ఒక మహోద్యమంగా ప్రజ్వరిల్లింది.
– భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి స్వాతంత్య్ర సమరోద్యమంలో వయసుతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులు చైతన్య స్ఫూర్తితో పాల్గొని అశువులు బాసారు.
– ఝాన్సీ లక్ష్మీభాయి, గాంధీ, భగత్‌సింగ్‌, చంథ్రేఖర్‌ ఆజాద్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, నెహ్రూ, పటేల్‌, నేతాజీ, తిలక్‌ వంటి ఎందరో మహానుభావులు, మేధావులు, విద్యావంతులు అకుంఠితత్యాగదీక్షాదకక్షులు స్వాతంత్య్ర సంపాదనకు నడుం బిగించారు. కాగా స్వతంత్ర భారతావనిని సాకృతం చేయడం వెనుక అశువులు బాసిన వారిలో చరిత్రకెక్కని చరితార్థులు కూడా ఎందరో ఉన్నారు. అట్టి మహానుభావులందరినీ నేడు స్మరించుకోవడం మన కనీస కర్తవ్యం.
– స్వార్థ కర్కశ పరిపాలన నుంచి భారతీయులకు విముక్తి కల్గించడంకోసం ఆనాటి నాయకులు నిస్స్వార్థంగా, నిష్కళంకంగా పోరాడారు. స్వరాజ్య హోమాగ్నిలో సమిధలగుటకు ముందుకొచ్చిన వారిలో మతాలకతీతంగా, ప్రాంతాలకతీతంగా, భాషలకతీతంగా, సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొని, చెరసాలలకు వెళ్లి, తమ సర్వస్వాన్ని కోల్పోయి అష్టకష్టాలపాలై దేనినీ లెక్కించక స్వాతంత్య్రాన్ని సాధించేవరకూ విశ్రమించలేదు.
– ప్రపంచ దేశానికి హిందూ సనాతన ధర్మం యొక్క మహోన్నత శక్తిని ప్రబోధించిన స్వామి వివేకానంద భారతదేశ యువతీ యువకుల్లో నూతన చైతన్యాన్ని రగిల్చారు. ”రణధీరత్వానికి కావలిసినది నాయకత్వ శక్తి మాత్రమే కాదు, ఆత్మత్యాగం కూడా కావాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలొడ్డడానికి కూడా వెనుకంజ వేయరాదు” అని యువతరానికి చాటిచెప్పిన మహోన్నతశీలి స్వామి వివేకానంద.
– విదేశీ విధానాలకు స్వస్తి చెప్పి, స్వదేశీవస్త్రాలు, స్వదేశీవస్తువులు, కట్టుబొట్టూ అన్నింటా స్వదేశీయసంస్కృతినే అనుసరించాలని హితవు పలికారు. పలికింది ఆచరించి చూపారు. వారి ఆచరణ ఫలితమే – వారిని త్యాగమూర్తులుగా, దేశోద్ధారకులుగా, జాతిపితలుగా సమున్నతస్థానంలో నిల్పింది – భారతదేశం. ఆనాటి వారి త్యాగఫలం వారనుభవించింది తక్కువైనా, తర్వాతివారమైన మనం ఈనాడు సంపూర్ణ స్వతంత్ర భారతీయులుగా, మనదేశం ప్రపంచదేశాల్లో విస్తృత స్వతంత్రదేశంగా, మన కీర్తిపతాకం ఎగురవేయగలిగాం.
– ఆధ్యాత్మికంగా భారతీయులకున్న సంపద రాజ్యాంగంలో మిళితమై ప్రపంచదేశాలకే మనదేశం ఆదర్శవంతంగా నిలిచింది. ఈనాటికీ భగవద్గీతమీద ప్రమాణం చేసి, న్యాయస్థానాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటే భారతీయుల ఆధ్యాత్మికసంపత్తి ఎంత ప్రశస్తమైందో అర్థమౌతూంది.
– ఆధ్యాత్మికజ్ఞానబలంతోనే మహాత్మాగాంధీ రవి అస్తమించని ఆంగ్లసామ్రాజ్యాన్ని తరిమికొట్టగలిగాడు. సత్యాహింసలే బాసటగా భారతీయులను ఒక్క త్రాటిపై నడిపించాడు. అలాంటి మహాత్ములస్ఫూర్తినీ, కీర్తినీ గణతంత్రదినోత్సవంనాడు మనం త్రికరణశుద్ధిగా స్మరించి, పతాకవందనం ద్వారా మనజాతినీ, ఈ జాతికి జీవం పోసిన మహనీయులనూ, వారి త్యాగదీక్షనూ ఆదర్శంగా తీసుకొని, భావిభారత నిర్మాణానికి గట్టిపునాదులు వేసుకునే అవకాశమే ఈ జాతీయ మహోత్సవం!
– ‘జెండా జాతికి జీవకర్ర’  భారతదేశ త్రివర్ణ పతాకం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మూర్తీభవించిన చిహ్నంగా దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా రూపొందించబడింది.
– కుంకుమపూవు రంగు(కాషాయ రంగు) శౌర్యాన్ని, త్యాగశీలాన్ని ప్రతిబింబిస్తే, మధ్యలో ఉన్న శ్వేతవర్ణం శాంతి, అహింస, సత్యసూచికగా భాసిల్లుతుంటే, ఆకుపచ్చని రంగు సస్యశ్యామలతకు, ఔదార్యభావానికి నిదర్శనంగా నిలిచి, మధ్యనున్న రాట్నం యావత్‌ భారత ప్రజానీక స్వాతంత్య్ర ఆశయచిహ్నంగా ధర్మచక్రంగా ప్రశస్తి పొందింది.
– పాలనయంత్రాంగానికి భక్తి, ధర్మం ఆధ్యాత్మికత అనే త్రీవేణీసంగమం తోడైనప్పుడు సర్వత్రా శాంతి సౌభాగ్యాలు, ఐకమత్యం, జాతీయసమైక్యత, సౌభ్రాతృత్వం వర్ధిల్లుతాయి.
– భారతీయులంటే జ్ఞానంపై ఆసక్తి కలిగినవాళ్ళు. జ్ఞానం భగవత్‌ స్వరూపం. భగవంతుని సంపూర్ణకృపకు పాత్రులు కావడానికి భక్తిధర్మజ్ఞానాలు శక్తిత్రయం! ఈ మూడు శక్తులూ మేళవించిన ఉత్తమ జీవితం ఒక్క మానవాళికే సాధ్యం! మనసా కర్మణా వాచా శ్రీ వేంకటేశ్వరుని నిరంతర కైంకర్యంతో పునీతులమై, భక్తసేవయే భగవత్‌ సేవగా జీవితాన్ని చరితార్థం చేసుకొనే అదృష్టం మనకు శ్రీవారి కృప వల్ల లభించింది. ఇందుకు కృతజ్ఞతా సూచకంగా – నిష్కళంక, నిస్స్వార్థ హృదయంతో భగవత్‌, భక్త సేవలతో తరించడం మన కర్తవ్యం.
– శ్రీనివాసునికి నిత్యం జరిగే సేవలు – సామాన్యులూ, ఇక్కడికి రాలేనివాళ్ళూ చూచి ధన్యు లయ్యేందుకై దేవస్థానం దేశం నలుమూలల గోవింద కల్యాణాది ఉత్సవాలు, కైంకర్యాలు నిర్వహించి, ప్రజా హృదయంలో భక్తిచైతన్య స్ఫూర్తికి మనం విశేషంగా కృషిచేస్తున్నాము.
– సదాచారం, శుభప్రదం, మనగుడి, ప్రహ్లాదం వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ – విద్యార్థులలో, యువతలో, గ్రామనగర వాసులలో – మన భారతీయ ఆచారవ్యవహారాల ఆంతర్యాన్ని వివరిస్తూ, ప్రజలలో ఐకమత్యాన్ని పెంపొందిస్తూ భారతీయతను సుస్థిరపరచేందుకు స్థిరసంకల్పంతో కృషి చేస్తున్నాము. ఇందుకు అన్ని విధాల తమ సంపూర్ణ సహకారం అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులందరినీ  హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
– భావితరాలకు స్ఫూర్తిదాయకంగా, ఆచరణీయంగా మనం వేసే ప్రతి అడుగు ఉండడం అవసరం. మనం భక్తసేవకులమైతే చాలు – భగవత్‌ సేవకులమైనట్లే! భగవంతుడు భక్తప్రియుడు, భక్తివశ్యుడు కదా! మనం భగవత్‌, భాగవతసేవతో రాజిల్లినప్పుడే మన ఉద్యోగ జీవితం కృతార్థమూ, ధన్యమూ అవుతుంది.
– కనుక ప్రముఖ ధార్మిక క్షేత్రమైన మన తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన ఒక సమున్నత ప్రణాళికతో ఆదర్శవంతంగా భక్తజనావళికి ఇతోధికమైన సేవలందించే మార్గంలో పయనించాలనీ, మీ అందరి సహకారసంపదలతో తి.తి.దేవస్థానపరిపాలన ఇతర ధార్మిక సంస్థలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనీ భావిస్తూ జగద్రక్షకుడైన శ్రీనివాసుడు యావత్‌ ప్రపంచాన్ని శాంతిసౌఖ్యాలతో, సకలాభ్యుదయాలతో వర్ధిల్లజేయాలని స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.