LORD RAMA RIDES SIMHA VAHANAM_ సింహ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం

Tirupati, 18 March 2018: The third day of Navahnika brahmotsavams in the temple of Sri Kodanda Rama in Tirupati witnessed Lord taking pride ride on Simha Vahanam.

Seated majestically on the mighty vahanam, lord took celestial ride along four mada streets and blessed the devotees.

DyEO Smt Jhansi, Executive Engineer Sri Jagadeeswara Reddy, AVSO Sri Ganga Raju, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సింహ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం

మార్చి 18, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది.

సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.

వాహనసేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంలతో సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై రాములవారు భక్తులకు కనువిందు చేయనున్నారు.

ముత్యపుపందిరి వాహనం :

ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామి అమ్మవారికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు :

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 7 నుండి 8 గంటల వరకు ధర్మగిరి వేద పాఠశాల ఆధ్వర్యంలో వేదపారాయణం నిర్వహించారు.

శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ జి.చెన్నకేశవులునాయుడు ధార్మికోపన్యాసం చేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీశేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.