LORD SRI RAMA ENCHANTS DEVOTEES IN MOHINI AVATAR_ పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు

Tirupati, 20 March 2018: Lord Sri Rama on fifth day mesmerized the devotees in the guise of universal beauty “Mohini”.

The palanquin was finely decked with variety of flowers. Lord as Mohini seated in style and took celestial ride around the four mada streets to bless devotees.

PROCESSION OF PADALU

Earlier during the day, the sacred Sri Rama Padalu were taken on a procession in the mada streets after Mohini avataram.

DyEO Smt Jhansi, Executive Engineer Sri Jagadeeswara Reddy, AVSO Sri Ganga Raju, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు

మార్చి 20, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. భజనలు, కోలాటాల నడుమ స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం తప్పదు. ఆ కలహాన్ని నివారించి, అసురులను వంచించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.

వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 8 నుండి 11 గంటల వరకు గరుడసేవ అత్యంత వేడుకగా జరగనుంది.

గరుడ వాహనం :

నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

శ్రీరామచంద్రమూర్తి పాదాల ఊరేగింపు :

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారికి మంగళవారం రాత్రి జరుగనున్న గరుడసేవలో అలంకరించేందుకు శ్రీరామచంద్రమూర్తి పాదాలను ఉదయం వాహన సేవ అనంతరం ఆలయ నాలుగు మాడవీధుల్లో ఉరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 7 నుండి 8 గంటల వరకు ధర్మగిరి వేద పాఠశాల ఆధ్వర్యంలో వేదపారాయణం నిర్వహించారు.

శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల బృందం సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.