MANAGUDI SARE DISPATCHED TO TEMPLES ACROSS THE STATE ON AUG 10 _ ”మనగుడి” సారె దేవాలయాలకు వాహనాల్లో తరలింపు – జండా ఊపి ప్రారంభించిన తిరుమల జె.ఇ.ఓ
”మనగుడి” సారె దేవాలయాలకు వాహనాల్లో తరలింపు – జండా ఊపి ప్రారంభించిన తిరుమల జె.ఇ.ఓ
తిరుమల, 10 ఆగష్టు 2013 : తి.తి.దే మరియు రాష్ట్రదేవాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 21వ తేదిన మూడవ విడత ”మనగుడి” కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 21,142 దేవాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు.
తిరుమలలో శనివారంనాడు ”మనగుడి” కార్యక్రమానికి సంబంధించిన వస్త్రాలను, సారెలను, కంకణాలను పెట్టెలలో అమర్చి వివిధ జిల్లాలలో వెలసివున్న వివిధ దేవాలయాలకు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్న వాహనాలను ఆయన ఆస్థానమండపం నుండి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మనగుడి’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుందన్నారు. గత రెండు విడతల్లో కన్నా మూడవ విడతలో మరింత విశేషస్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తి.తి.దే కృషిచేస్తున్నదన్నారు. ఇప్పటికి అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 4,854 దేవాలయాల్లో, తూర్పుగోదావరిజిల్లాలో 756, విశాఖపట్టణంలో 900, విజయనగరం 1100, శ్రీకాకుళం 875 దేవాలయాలకు మొదటి విడతలో ఈ పూజా సామగ్రిని వాహనాల్లో తరలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమినాడు నిర్వహించే మనగుడి కార్యక్రమానికి రెండుకోట్ల కంకణాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మనగుడ ిసారెను సమాయత్తం చేసి వాహనాల్లో తరలించడంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న శ్రీవారి సేవకులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటి.ఇ.ఓలు శ్రీ చిన్నంగారి రమణ, శ్రీ కృష్ణారెడ్డి, శ్రీ ఉమాపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.