METLOTSAVAM OBSERVED AT ALIPIRI_ మహర్షులను అనుసరించడమే మెట్లోత్సవం అంతరార్థం : శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామి

Tirupati, 16 July 2018: Traimasika Metlotsavam was observed with religious fervour in Alipiri during wee hours on Monday.

Sri Sri Sri Vidyaprasannatheertha Swmay of Kukke Subramanya Swamy Mutt, Karnataka in his religious discourse recalled the holy trekking carried out by many saints, emperors, ardent devotees of Lord Venkateswara and explained the significance of walkathon along the Alipiri footpath.

After performing puja, over 3000 Dasa paras hailing from AP, TS, TN, Karnataka, they started trekking the Alipiri footpath route rendering Purandhara, Kanaka, Narayana, Vijayadasa Padagalu and reached Tirumala with utmost devotion.

Dasa Sahitya Project Special Officer Dr P Ananda Teertha Charylu supervised the arrangements.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మహర్షులను అనుసరించడమే మెట్లోత్సవం అంతరార్థం : శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామి

తిరుపతి, 2018 జూలై 16: పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు కాలినడకన తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకున్నారని, అలాంటివారి అడుగుజాడల్లో నడిచి ఆధ్యాత్మిక చైతన్యం పొందడమే మెట్లోత్సవం అంతరార్థమని ఉడిపి శ్రీ పేజావర్‌ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామి అనుగ్రహభాషణం చేస్తూ బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీవ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టిటిడి మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ప్రసంగిస్తూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు తెలిపారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.

అంతకుముందు భజనమండళ్ల భక్తులు టిటిడి మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 3000 మందికిపైగా భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.