NANDI DHWAJAPATHAM FLIES HIGH ON TEMPLE MAST IN SRI KT_ ధ్వజారోహణంతో వేడుకగా శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirupati, 6 February 2018: The Nandi Dhwaja Patham flied high on the temple pillar in the famous shrine of Sri Kapileswara Swamy temple in Tirupati on Tuesday in the auspicious Kumbha Lagnam.

The entire ceremonial fete of Dhwajarohanam took place as per the tenets of Saivagama. The traditional flag with the image of sacred bull, Nandi was hoisted on the temple pillar by the temple priests chanting mantras marking the grand commencement of annual brahmotsavams in the temple.

Temple DyEO Sri Subramanyam and other officials were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ధ్వజారోహణంతో వేడుకగా శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఫిబ్రవరి 06, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటల నుండి ధ్వజారోహణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 8.30 గంటలకు కుంభ లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీమణిస్వామి, కంకణభట్టర్‌ శ్రీఉదయస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

ఏడాదికోసారి ధ్వజస్తంభానికి విశేష అభిషేకం :

ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మూెత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 13న శివరాత్రి పర్వదినం విశేషంగా జరుగనుందని తెలిపారు. ఫిబ్రవరి 14న కల్యాణోత్సవం, ఫిబ్రవరి 15న త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి క పకు పాత్రులు కావాలని కోరారు.

అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

హంస వాహనం :

రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో విహరించనున్నారు. ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీ సి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న శివపార్వతుల సెట్‌ :

శ్రీ కపిలేశ్వరాలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శివపార్వతుల సెట్‌ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ పార్వతిదేవి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీవినాయకస్వామి కలిసి యోగనిద్రలో ఉన్న శివున్ని ఆరాధించే దృశ్యాన్ని ఇక్కడ కళ్లకు కట్టారు. ఇందులో భారీ శివలింగం, వృషభం రూపాలు ఆకట్టుకుంటున్నాయి. టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సెట్‌ భక్తులకు భక్తి భావం పంచుతోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.