నూతన ఆంగ్ల సంవత్సరాదికి టిటిడి స్థానిక ఆలయాల ముస్తాబు
నూతన ఆంగ్ల సంవత్సరాదికి టిటిడి స్థానిక ఆలయాల ముస్తాబు
తిరుపతి, 2018 డిసెంబరు 30: నూతన ఆంగ్ల సంవత్సరాది 2018, జనవరి 1వ తేదీకి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబయ్యాయి. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది అందంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం 6.00 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో తెల్లవారుజామున 4.00 నుండి 6.00 గంటల వరకు తిరుపల్లాచ్చి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, అర్చన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6.00 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో తెల్లవారుజామున 4.00 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తెల్లవారుజామున 3.30 నుండి 4.00 గంటల వరకు తిరుప్పావై, తోమాల, అర్చన, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5.00 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ఉదయం 5.00 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ నూతన ఆంగ్ల సంవత్సరాదికి ఘనంగా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం, తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, నగరిలోని శ్రీకరిమాణిక్యస్వామివారి ఆలయం, కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, చంద్రగిరి లోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామివారి ఆలయం, కీలపట్లలోని శ్రీకోనేటిరాయస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేపట్టారు.
అదేవిధంగా, కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, తాళ్లపాకలోని శ్రీచెన్నకేశవస్వామివారి ఆలయం, జమ్మలమడుగులోని శ్రీనరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.