PADMAVATHI SRINIVASA WEDS IN “ASTALAKSHMI PARINAYA VEDIKA” _ అష్టలక్ష్మీ మండపంలో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

Tirumala,24 April 2018: The three-day Padmavathi Parinayotsavam off to a colourful start on Tuesday evening with the processional deities entering the celestial wedlock in a jubilant manner.

The Padmavathi Parinaya Mandapam which was conceptualised on “Astalakshmi” theme with the setting of Eight different figurines of Goddess of Wealth decking up the Parinaya Mandapam in a gorgeous way.

The Utti Krishna, chandeliers, crystals, flowers, fruits etc. enhanced the beauty of Parinaya Mandapam.

Meanwhile on the first day Lord Malayappa came on small Gaja Vahanam flanked by His consorts Sri Devi and Bhu Devi on two different Tiruchi vahanams. After Edurkolu, Varanamayiram, the Pubantata is performed with enthusiasm. The temple and religious staffs divided into two groups with one supporting the Lord who is Bridegroom and Goddesses who are brides.

Later Unjal seva performed amidst recitation of vedic hymns, followed by devotional songs. TTD EO Sri AK Singhal and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

అష్టలక్ష్మీ మండపంలో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

ఏప్రిల్‌ 24 తిరుమల 2018 ; తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మేలా ఏర్పాటుచేసిన అష్టలక్ష్మీమండపంలో మంగళవారం నాడు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ వైశాఖశుద్ధ దశమి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేసినట్టు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా 1992వ సంవత్సరం నుంచి ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోందన్నారు. శ్రీమలయప్పస్వామివారు తొలిరోజు గజవాహనం, రెండవరోజు అశ్వ వాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారని, మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారని, ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నులపండుగగా జరుగుతుందని వివరించారు.

మొదటిరోజు వైశిష్ట్యం :

శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన మంగళవారంనాడు శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీస్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు. పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారుతిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

ప్రత్యేక ఆకర్షణగా అష్టలక్ష్మీ మండపం :

శ్రీ పద్మావతి పరిణయ మండపాన్ని ఆపిల్‌, నారింజ, ద్రాక్ష, మొక్కజొన్న కంకులు, అనాస పండ్ల, అరటి, మామిడి కొమ్మలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం అలంకరణకు బంతి, చామంతి, వట్టివేరు, వాడామల్లి, నాలుగు రంగుల రోజాలు, ఆర్కుట్‌, కార్నస్‌ తదితర పుష్పాలను వినియోగించారు. మొత్తం 4 టన్నుల ఫలాలు, ఒక టన్ను సంప్రదాయ పుష్పాలు, 20 వేల కట్‌ ఫ్లవర్లు ఉపయోగించారు. మధ్యమధ్యలో క్రిస్టల్‌ బాల్స్‌, షాండ్లియర్లు, వెన్నముంతలు వేలాడదీశారు. మండపంలోని ప్రధాన స్తంభాలకు చిన్నికృష్ణుడు, వెన్నకృష్ణుడి బొమ్మలను ఏర్పాటుచేశారు. కాగా ఈ మండప అలంకరణకు పుణెకి చెందిన శ్రీ వేంకటేశ్వర చారిటబుల్‌ ట్రస్టు వారు టిటిడికి విరాళం అందించారు. దీనికి తోడుగా ప్రాంగణాన్ని విద్యుత్తుదీపాలతో అత్యంత మనోహరంగా అలంకరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విఎస్‌వో శ్రీరవీంద్రారెడ్డి, ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.