శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ప్ర‌త్యేక వ్యాసం

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ప్ర‌త్యేక వ్యాసం

శ్రీవారి దేవేరికి ఏడాది పొడవునా ఉత్సవాలు

డిసెంబరు 07, తిరుప‌తి, 2018: శ్రీవారి హృదయలక్ష్మి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు లోకాన్ని రక్షించే తల్లి. తిరుమల శ్రీవారి ఆలయం తరువాత తిరుచానూరులోని శ్రీపద్మాతి అమ్మవారి ఆలయాన్ని ఎక్కువమంది భక్తులు దర్శించుకుంటున్నారు. క్రీ.శ1820-50 సంవత్సరాల మధ్యకాలంలో అమ్మవారి ఆలయాన్ని హథీరాంజీ మఠాధిపతులు జీర్ణోద్ధారణ చేశారు. అప్పటినుంచి ఆలయంలో నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

శ్రీపద్మావతి అమ్మవారికి నిత్యం సుప్రభాతం, సహస్రనామార్చన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఏకాంత సేవ, కుంకుమార్చన, వేదాశీర్వచన సేవలు నిర్వహిస్తారు. వారోత్సవాల్లో భాగంగా సోమవారం అష్టదళపాదపద్మారాధన, మాసంలో మొదటి బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం, గురువారం తిరుప్పావడ, శుక్రవారం అమ్మవారి మూలమూర్తికి అభిషేకం, వ‌స్త్రాలంకార‌సేవ‌ నిర్వహిస్తారు. శనివారం సామవేద పుష్పార్చన జరుగుతుంది. పక్షోత్సవాల కింద ప్రతి ఏకాదశినాడు ద్వారపాలకులకు కర్మార్జ బింబమాల, స్నపన విశేషాలు నిర్వహిస్తారు.

మాసోత్సవాలు :

ప్రతి మాసంలో శ్రీపద్మావతి అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాడ సందర్భంగా ఉత్సవర్లకు అభిషేకం, రాత్రి గజవాహనసేవ నిర్వహిస్తారు. రోహిణి నక్షత్రం నాడు శ్రీకృష్ణుడికి అభిషేకం, వీధి ఉత్సవం జరుపుతారు. అష్టమినాడు శ్రీకృష్ణుడికి స్నపన తిరుమంజనం చేపడతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున శ్రీసుందరరాజస్వామివారికి తిరుమంజనం, ఊంజల్‌సేవ, వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.

సంవత్సరోత్సవాలు :

సంవత్సరోత్సవాల్లో ప్రధానమైన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన, పుష్పయాగం నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో ధనుర్మాసం, మాఘమాసంలో తైమాసం-శరడులు(తిరుమాంగళ్యం), పాల్గుణ మాసంలో పంగుణి ఉత్తర ఉత్సవం, చైత్ర మాసంలో ఉగాది, వసంతోత్సవాలు, జ్యేష్ట మాసంలో తెప్పోత్సవాలు, శ్రావణమాసంలో కృష్ణాష్టమి, వరలక్ష్మీవ్రతం, భాద్రపదంలో పవిత్రోత్సవాలు, ఆశ్వయుజంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారని టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీమత్‌ తిరుమల కాండూరి శ్రీనివాసాచార్యులు తెలియజేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.