PANDURANGA RIDES ON VASUKI_ చిన్నశేషవాహనంపై పండరీపురం పాండురంగస్వామివారి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
Srinivasa Mangapuram, 25 Feb. 19: The processional deity of Sri Kalyana Venkateswara Swamy in Srinivasa Mangapuram took celestial ride on the five hooded serpent king Vasuki as Pandaripura Panduranga Vittala to bless His devotees on second day morning on Monday as a part of the ongoing annual brahmotsavams.
It was delight to see Lord in this guise on small size serpent carrier.
The cultural troupes added beauty to the procession all through the four mada streets.
The devotional programmes by Annamacharya Project, Dasa Sahitya Project, Dharma Prachara Parishad, SV College of Music and Dance engaged the pilgrims from morning till evening with religious fervour.
Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Muni Chengalrayulu, Temple Inspector Sri Anil and others took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
చిన్నశేషవాహనంపై పండరీపురం పాండురంగస్వామివారి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
తిరుపతి, 2019, ఫిబ్రవరి 25: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు పండరీపురం పాండురంగస్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనంపై ఊరేగుతారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతికప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కల్యాణప్రదులై, సుఖశాంతులతో ఆనందజీవులతారు.
వాహన సేవ అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబరి నీళ్ళతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధనంజయులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మయ్య, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, ప్రధాన కంకణబట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.