PAT VASANTHOTSAVAM POSTERS RELEASED_ ఏప్రిల్‌ 28 నుండి 30వ తేదీ వరకు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Tirupati, 13 April 2018: The posters of annual Vasanthotsavams in Sri Padmavathi Devi temple at Tiruchanoor was released on Friday by Tirupati JEO Sri P Bhaskar in his chambers in TTD administrative building.

The annual event will take place for three days in Friday Gardens from April 28 to 30 with Ankurarpanam on April 27 and Koil Alwar Tirumanjanam on April 24.

Spl Gr DyEO Sri Munirathnam Reddy was also present during the poster release.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 28 నుండి 30వ తేదీ వరకు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

పోస్టర్లు ఆవిష్కరించిన టిటిడి తిరుపతి జెఈవో

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 13: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్‌ 28 నుండి 30వ తేదీ వరకు జరుగనున్న వార్షిక వసంతోత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ శుక్రవారం టిటిడి పరిపాలనా భవనంలోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంటేశ్వరస్వామివారి పట్టపురాణి, అలమేల్మంగ తిరుచానూరులో అవతరించిందన్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వసంతోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ఏప్రిల్‌ 27వ తేదీ అంకురార్పణంతో వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి, ఈ సందర్భంగా ఏప్రిల్‌ 24వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వసంతోత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 29వ తేదీన ఉదయం స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ఈ సందర్భంగా ఈ మూడు రోజులపాటు సాయంత్రం 3.00 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారిని ఘనంగా ఊరేగించనున్నారు.

గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవం సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలైన లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజలసేవను రద్దు చేశారు. ఆలయం వద్దనున్న ఆస్థాన మండపంలో ప్రతిరోజూ సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో కళాకారులతో భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రాశస్త్యం –

సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి ఏడాది పొడవున అనేక ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో అమ్మవారి వసంతోత్సవాలు అత్యంత మహిమాన్వితమైనవని పురాణాల ద్వారా తెలుస్తుంది.

వసంత ఋతువు ప్రాణుల పాలిట యముని కోరలుగా పెద్దలు తెలియజేశారు. సూర్యుడు వసంత ఋతువులో మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు, కావున ఆ తేజోవృద్ధివల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. శ్రీ పద్మావతి అమ్మవారిని ఈ ఋతువులో వసంతోత్సవాల ద్వారా ఆరాధనం చేయడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగి, ఆయురారోగ్యలు వృద్ధి చెందుతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ మునిత్నంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.