డిసెంబరు 12న పంచమీ తీర్థం

డిసెంబరు 12న పంచమీ తీర్థం

తిరుపతి, 2018 డిసెంబరు 11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబరు 12వ తేదీ బుధవారం పంచమీ తీర్థం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8.00 గంటల వరకు అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు పద్మపుష్కరిణి వద్ద ఉన్న పంచమి తీర్థ మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11.42 గంటలకు మకర లగ్నంలో చక్రస్నానం శాస్త్రోక్తంగా జరుగనుంది.

కార్తీక శుక్ల పంచమినాడు పద్మసరోవరాన్ని సేవించడమే తిరుచానూరు పంచమిగా భక్తులు పేర్కొంటారు. ఆనాడే పద్మసరోవరం నుండి అలమేలుమంగ ఆవిర్భవించి శ్రీనివాసునికి ప్రసన్నమై స్వామి తపస్సును ఫలింపజేసింది. అందుకే బ్రహ్మాది దేవతలు, ఎందరో మహర్షులు ఈ తీర్థాన్ని కొనియాడినారు. పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటుచేశారు. అదేవిధంగా పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుంది కావున భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.

డిసెంబరు 13న పుష్పయాగం :

డిసెంబరు 13వ తేదీ గురువారం ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చాన నిర్వహించనున్నారు.

అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుంచి 8.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేస్తారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు.

కాగా డిసెంబరు 13వ తేదీ గురువారం ఆలయంలో పుష్పయాగం సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.