PAVITHROTSAVAMS CONCLUDES ON A RELIGIOUS NOTE _ పూర్ణాహుతితో తిరుమలలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు
పూర్ణాహుతితో తిరుమలలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుమల, 19 ఆగష్టు 2013 : తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా మూడురోజులపాటు నిర్వహించబడే పవిత్రోత్సవాలు సోమవారంనాడు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.
తొలి రెండురోజుల్లాగానే సోమవారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు. తరువాత ఉదయం 9.00 గం||ల నుండి 11.00 గం||ల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా గోక్షీరము, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీనితో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.
కాగా సోమవారం మధ్యాహ్నం 1 గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇక రాత్రి 7.00 గం||లకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవిలతో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తి అవుతాయి.
పవిత్రోత్సవాల నేపథ్యంలో సోమవారంనాడు తి.తి.దే కల్యాణోత్సవవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను తి.తి.దే రద్దు చేసింది.
ఈ పవిత్రోత్సవాలలో తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, ఇ.ఓ. శ్రీ యం.జి గోపాల్, జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు, తదితర ఆలయ అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.