శ్రీ వేదనారాయణస్వామివారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ వేదనారాయణస్వామివారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

మార్చి 22, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో మార్చి 24 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాల గోడపత్రికలను టిటిడి స్థానికాలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన చంద్ర‌ప్రభ వాహనసేవలో ఈ కార్యక్రమం జరిగింది.

మార్చి 24 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం కల్పిస్తారు. రాత్రి 7.30 గంటల నుండి 9 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

తెప్పోత్సవాలు :

శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 24 నుండి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు, రెండవ రోజు గోదాదేవి సమేత వేదనారాయణస్వామివారు, మూడవ రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, చివరి రెండు రోజులు శ్రీభూ సమేత వేదనారాయణస్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

మార్చి 25న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఇఇ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.