బమ్మెర పోతన ”శ్రీమహాభాగవతం” సరళ వ్యాఖ్యాన గ్రంథానికి విశేష ఆదరణ

బమ్మెర పోతన ”శ్రీమహాభాగవతం” సరళ వ్యాఖ్యాన గ్రంథానికి విశేష ఆదరణ

అక్టోబరు 20, తిరుపతి, 2017 : తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన ”బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీమహాభాగవతం సరళవ్యాఖ్యానసహితం” గ్రంథానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సామాన్య ప్రజలు సులభంగా చదివి అర్థం చేసుకునేలా సరళమైన భాషలో ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దారు. ప్రతిపదార్థ, తాత్పర్య, సరళ వ్యాఖ్యానంతో కూడిన ఈ గ్రంథాన్ని పాఠకులు విశేషంగా కొనుగోలుచేసి భక్తితత్వాన్ని ఆస్వాదిస్తున్నారు.

12 స్కంధాలతో కూడిన ఎనిమిది సంపుటాలు గల ఈ గ్రంథం ధరను రూ.1,260/-గా టిటిడి నిర్ణయించింది. తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలలతోపాటు హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో గల టిటిడి సమాచార కేంద్రం, చెన్నైలోని టి.నగర్‌లో ఉన్న సమాచార కేంద్రంలో గల పుస్తక విక్రయశాలల్లో ఈ గ్రంథం భక్తులకు అందుబాటులో ఉంది. ప్రతిపదార్థ తాత్పర్యాలతో కూడిన సరళ వ్యాఖ్యానాన్ని 33 మంది ప్రసిద్ధ పండితులు రచించారు. దాదాపు ఆరు వేల పేజీలు గల ఈ గ్రంథంలో కీ.శే బాపు వర్ణచిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మొదటి సంపుటంలో 1, 2వ స్కంధాలున్నాయి. వీటికి ప్రధాన సంపాదకులుగా విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు వ్యవహరించారు. డా|| కేశాప్రగడ సత్యనారాయణ, డా|| మల్లెల గురవయ్య, డా|| సముద్రాల లక్ష్మణయ్య వ్యాఖ్యానం అందించారు.

రెండవ సంపుటంలో 3వ స్కంధం ఉంది. ప్రధాన సంపాదకులుగా విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు వ్యవహరించారు. డా|| కడిమిళ్ల వరప్రసాద్‌, డా|| కసిరెడ్డి వెంకటపతిరెడ్డి, డా|| గల్లా చలపతి వ్యాఖ్యానం చేశారు.

మూడవ సంపుటంలో 4, 5వ స్కంధాలున్నాయి. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య కాగా, వ్యాఖ్యాతలుగా డా|| దావులూరి కృష్ణమూర్తి, డా|| ఆర్‌.అనంతపద్మనాభరావు, డా|| శలాక రఘునాథశర్మ, డా|| కె.సర్వోత్తమరావు వ్యవహరించారు.

నాలుగో సంపుటంలో 6, 7వ స్కంధాలున్నాయి. ప్రధాన సంపాదకులుగా డా|| సముద్రాల లక్ష్మణయ్య వ్యవహరించారు. డా|| జోస్యుల సూర్యప్రకాశరావు, డా|| కొంపిల్ల రామసూర్య నారాయణ, శ్రీ కోట వేంకటలక్ష్మీనరసింహం, డా|| ఆకురాతి పున్నారావు, డా|| ఆకెళ్ల విభీషణశర్మ వ్యాఖ్యానం అందించారు.

ఐదో సంపుటంలో 8, 9వ స్కంధాలున్నాయి. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య కాగా, వ్యాఖ్యాతలుగా డా|| హెచ్‌ఎస్‌.బ్రహ్మానంద, డా|| వైద్యం వేంకటేశ్వరాచార్యులు, డా|| డి.మీరాస్వామి, శ్రీ కోట వేంకటలక్ష్మీనరసింహం వ్యవహరించారు.

ఆరో సంపుటంలో 10వ స్కంధం పూర్వభాగం ఉంది. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య కాగా, డా|| అప్పజోడు వేంకటసుబ్బయ్య, డా|| ఏఎస్‌.గోపాలరావు, శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ, డా|| పి.నరసింహారెడ్డి, విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, డా|| పిఆర్‌.హరినాథ్‌ వ్యాఖ్యానం అందించారు.

ఏడో సంపుటంలో 10వ స్కంధం ఉత్తర భాగం ఉంది. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య కాగా, వ్యాఖ్యాతలుగా డా|| నాగళ్ల గురుప్రసాదరావు, డా|| ఎన్‌విఎస్‌.రామారావు, డా|| కె.మలయవాసిని, డా|| కె.జె.కృష్ణమూర్తి, డా|| సంగనభట్ల నరసయ్య వ్యవహరించారు.

ఎనిమిదో సంపుటంలో 11, 12వ స్కంధాలున్నాయి. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య కాగా, వ్యాఖ్యానం డా|| గల్లా చలపతి అందించారు.

ఉచిత డౌన్‌లోడ్‌ అవకాశం…

సరళ వ్యాఖ్యాన పోతన భాగవతాన్ని భక్తులందరికీ చేరువ చేయడంలో భాగంగా టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. www.tirumala.org వెబ్‌సైట్‌లో ‘ఈ-పబ్లికేషన్స్‌’ను క్లిక్‌ చేయడం ద్వారా లేదా ebooks.tirumala.org లింక్‌ ద్వారా భక్తులు ఈ గ్రంథాన్ని చదువుకోవడంతోపాటు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పోస్టు ద్వారా గ్రంథం కావాలంటే…

శ్రీ మహాభాగవతం గ్రంథాన్ని పోస్టు ద్వారానూ భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ”సహాయ కార్యనిర్వహణాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు పే విధానం(పోస్టల్‌ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు ఈ గ్రంథాలను పంపడం జరుగుతుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.