PRASANNA VENKATESWARA RIDES KALPAVRIKSHA_ కల్పవృక్ష వాహనంపై శ్రీ గోపాల బాలుడి అలంకారంలో శ్ర్రీ పసన్న వేంకటేశ్వరుడు

Appalayagunta. 26 June 2018: On the fourth day morning Lord Sri Prasanna Venkateswara Swamy took celestial ride on Kalpavriksha Vahanam on Tuesday morning.

Lord, flanked by His two consorts Sridevi and Bhudevi roamed through the street s surrounding the temple.

Devotees witnessed the procession of Lord with utmost veneration.

Temple Special Grade DyEO Sri Munirathnam Reddy, AEO Sri Subrahmanyam, Superintendent Sri Gopala krishna Reddy took part in the fete.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ గోపాల బాలుడి అలంకారంలో శ్ర్రీ పసన్న వేంకటేశ్వరుడు

తిరుపతి, 2018 జూన్‌ 26: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోపాల బాలుడి అలంకారంలో తెల్లటి తలపాగతో రాజదండం దరించి పశువుల కాపరిగా శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలు శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.

అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మంగళవారం రాత్రి సమస్త రాజ లాంఛనాలతో సర్వభూపాల వాహనసేవ అద్భుతంగా ఉంటుంది. భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటిని పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం. ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. మా ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్‌ కల్యాణమూర్తికి వాహనమైపోతారు. అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి ఊరేగడమే సర్వభూపాల వాహనసేవ.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.