PROCESSION OF AKASA GANGA THEERTHAM _ జ‌న‌వ‌రి 10న‌ ఆకాశగంగలో ప్ర‌త్యేక పూజలు – టిటిడి

జ‌న‌వ‌రి 10న‌ ఆకాశగంగలో ప్ర‌త్యేక పూజలు – టిటిడి

తిరుపతి,  2010 జనవరి 09: ఈనెల 10వ తేదిన ఆకాశగంగ ఉద్భవించిన రోజును పురస్కరించుకొని, తితిదే తిరుమల ఆలయ అర్చకులు, అధికారులు ఆకాశగంగ నుండి ఉదయం 5.30 గంటలకు కాలినడకన ఆకాశగంగ తీర్థమును శ్రీవారి ఆలయానికి తీసుకువస్తారు.

ఆకాశగంగ ప్రాశస్థ్యము:-

ప్రాచీన పురాణాలలో వేంకటాచలంపై గల తీర్థాల సంఖ్య, ప్రశస్తీ చాలా చోట్లవుంది.
1. వరాహపురాణం – వేంకటాచలసాదువుల్లో 1191 తీర్థాలు ఉన్నాయి తెలిపింది.
2. బ్రహ్మాండపురాణం – వేంకటాద్రిలో 66 కోట్ల పుణ్యతీర్థాలున్నాయి తెలిపింది. అందులో    1008 తీర్థాలు చాలా ముఖ్యమైనవి తెలిపింది.

మొత్తంపై ఈ పర్వత శ్రేణిలో అనేక తీర్థాలు ఉన్నాయనేది అన్ని పురాణాల ద్వారా తెలుస్తూంది.

3. వేంకటాచల మహాత్యం వర్ణించిన 11 పురాణాలలో 26 ముఖ్యతీర్థాలు కన్పిస్తాయి. అవి: 1) కుమారదార 2)కపిల 3) పాండవ 4)జరాహర 5) ఫల్గుని 6) జాబాలి 7) సనకసనందన 8)కాయరసాయన 9)పాపనాశన 10)దేవ 11)పద్మసరోవర 12)అస్థిసరోవర 13) తుంబ 14)ఆకాశగంగ 15)చక్ర 16)కటాహ 17)మన్వాది అష్టోత్తరశత (మను మొదలైన 108 తీర్థాల సమూహం) 18)రామకృష్ణ 19)శంఖ 20)కల్యా 21)శక్ర 22)విష్వక్సేన 23)పంచాయుధ 24)బ్రహ్మ 25)సప్తర్షి 26)వ్రతతీవర్తని – తీర్థాలు.
వీటిల్ని కూర్చిన విశేషాలు ఆయా పురాణాల్లో ఉన్నాయి. ఒక్క పుష్కరిణిలోనే 3 1/2 కోట్ల పుణ్యతీర్థాల శక్తి నిక్షిప్తం అయివుందని పురాణాలు పేర్కొన్నాయి.

తీర్థశబ్దార్థం :

తీర్థ శబ్దానికి మొదట ‘పుణ్య’ అని అర్థం తర్వాత అర్థం విస్తృతి చెంది, ‘పవిత్రమైన జలం’ అనే అర్థం వచ్చింది. అందుకే పుణ్య క్షేత్రాన్ని ‘తీర్థక్షేత్రం’ అంటారు.  
వేంకటాచలం – అనేక తీర్థాలకు నిలయం కనుక ‘తీర్థాద్రి అని అంటారు. తీర్థమంటే – తరింపజేసేది అని వ్యుత్పత్తి. మహర్షులు సేవించిన జలం – తీర్థం.

తీర్థాలను 4 విధాలుగా వర్ణీకరించవచ్చు.
1. ధర్మ ఆసక్తినిపేంచేవి. 2. జ్ఞానాన్ని సిద్ధింపజేసేవి.
3. భక్తివైరాగ్యాలను కల్గించేవి. 4. మోక్షాన్ని కల్గించేవి.

వీటిల్లో ఆకాశగంగా తీర్థం –

తీరనివాసం వల్ల, స్నానం వలన, తీర్థాన్ని స్వీకరించడం వల్ల, పాపాలు పోగొట్టి, మోక్షాన్ని కల్గించే విభాగంలోనివి. ఏడు 1)స్వామిపుష్కరిణి 2)కుమారధార 3)తుంబురుతీర్థం 4)రామకృష్ణతీర్థం 5)ఆకాశగంగ 6)పాపవినాశ తీర్థం 7)పాండవతీర్థం.

ఆకాశగంగా తీర్థ విశేషాలు వరహపురాణం, పద్మపురాణం, స్కాందపురాణంలలో వివరించబడినాయి.

ఆకాశగంగ:

తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరాన దట్టమైన అడవులూ, కొండల మధ్య, సముద్రమట్టానికి 2700 అడుగుల ఎత్తులో వున్న సొరంగ మార్గం నుండి నిరంతరం నీరు ప్రవహిస్తూంటుంది. ఈ జలపాతాన్నే ‘ఆకాశగంగ’ అంటున్నాం. ఈజలపాతం పర్వతం లోపలి భాగం నుండి ప్రవహిస్తూ – భూమికి దిగుతూంది. ఇది మోక్షాన్ని ప్రసాదించే ఏడు పుణ్య తీర్థాల్లో 5వది. అత్యంత పవిత్రమైనది. ఈ ఆకాశగంగాజలం శ్రీవారి అభిషేకానికి వినియోగింప బడుతూంది. ఈతీర్థం శ్రీవారి ఆలయానికి 5 1/2 కి.మీ. దూరంలో వుంది.

ఆకాశగంగ ఏర్పడిన విధం:

క్రీ.శ.10వ శతాబ్దంలో శ్రీరంగంలో యామునాచార్యులు – (వీరినే ఆళవందార్‌ అంటారు) ఉండేవారు. వారు శ్రీరంగనాథునికి పుష్పతీర్థాది కైంకర్యాలు చేసేవారు. తీరిక వేళల్లో శిష్యులకు విశిష్టాద్వైత విశేషాలు, భగవద్‌, భాగవత విషయాలు బోధించేవారు.

 ఒక నాడు యామునాచార్యులు, నమ్మాళ్వార్‌ రచించిన ‘తిరువాయ్‌మొళి’ మూడవ కొండలోని ”ఒళివిల్‌కాలమెల్లా ఉదనామ్‌” అనే మూడవ పాశురాన్ని వివరిస్తూ – భగవదారాధనలో పుష్ప, తీర్థ, దీప, ధూపానికైంకర్యాలు చేసినవారు ధన్యులవుతున్నారు. తిరువెంగడనాథునికి పుష్పతీర్థ కైంకర్యాలు నేను కొంత కాలం మాత్రమే చేయగలను. అల్ప అదృష్టవంతుణ్ణి – పూర్తి జీవితమంతా ఆస్వామిసేవ చేసే భాగ్యం నాకు కలుగలేదు. మరి ”పుష్పమండపం” అని ప్రసిద్ధిగాంచిన వేంకటాచల క్షేత్రానికి వెళ్లి అక్కడి వాతావారణానికి తట్టుకొని, తిరువెంగడనాధునికి నమ్మాళ్వార్లకు ఇష్టమైన తీర్థపుష్పకైంకర్యం శాశ్వతంగా చేసేవారు ఎవరైనా ఉన్నారా? అని శిష్యుల్ని అడిగాడు.

ఆచార్యుల మాట విన్న శ్రీశైలపూర్ణులనే పేరున్న తిరుమల నంబి వీరు శ్రీ రామానుజాచార్యులకు మేనమామ, గురువు అనే శిష్యుడు లేచి, గరువుకు నమస్కరించి, తిరుమలకు వెళ్ళి అక్కడేవుంటూ, స్వామివారికి తీర్థపుష్ప కైంకర్యం జీవితాంతం చేస్తానని మాటయిచ్చారు.
 
తర్వాత ఒక మంచి రోజున యామునాచార్యుల వారి ఆశీస్సుల్తో, అనుమతితో బయలుదేరి, తిరుమల నంబి, తిరుమలకు చేరారు. దేవాలయ దక్షిణ మాడవీధిలో వసతి ఏర్పరుచుకొన్నారు. ఆక్కడే ప్రస్తుతం ”తిరుమలనంబి ఆలయం వుంది”.

తిరుమలనంబి

 ప్రతిదినం తెల్లవారు జామున బయలుదేరి, శుచియై, ఆలయం నుండి 8 కి.మీ. దూరంలో వున్న పాపనాశన తీర్థ జలాన్ని మట్టికుండలో నింపుకొని, తలపై పెట్టుకొని, తిరుమంగై ఆళ్వార్‌ సాయించిన ద్రావిడపాశురాలు పఠిస్తూ, శ్రీవారి అభిషేక వేళకు ఆలయం చేరి, తీర్థకుంభాన్ని అర్చక స్వాములకు సమర్పించేవారు. అర్చక స్వాములు శ్రీవారిధ్రువమూర్తి పాదపద్మాలకూ, కౌతుకమూర్తియైన భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహానికి పాపనాశతీర్థ జలంతో నిత్యాభిషేకం చేసేవారు. ఇలా అంత దూరం నుండి తీర్థజలం తేవడానికీ తిరుమలనంబి చాలా శ్రమపడాల్సి వస్తుండేది. ఈతడు గావించే తీర్థసేవకు సంతోషించిన శ్రీవారు తిరుమలనంబి శ్రమను తగ్గింపదలచాడు.

 ఒక రోజు యథాప్రకారం తిరుమలనంబి పాపవినాశ తీర్థం తెస్తుండగా, మార్గమధ్యంలో శ్రీస్వామివారు ఒక యువకకిరాత రూపంలో, ధనుర్బాణాలు ధరించివచ్చి, ”తాతా!తాతా!” అంటూ పిలుస్తూ వెంటవచ్చాడు. ఆకిరాతరూపస్వామి ”తాతా! చాలా అలసిపోయాను దప్పిక ఎక్కువయింది ఆ కుండలోని నీళ్ళు కాసిన్ని ఇస్తావా?” అన్నాడు. నంబి గారు ”ఈతీర్థం శ్రీవారికైంకర్యానికై తీసుకెళ్లేది. దీన్ని త్రాగడానికి ఇవ్వరాదు” అని తిరస్కరించి ఆలయంవైపు నడవసాగాడు. నంబి పాశురాలు పాడుకొంటూ, భక్తితన్మయత్వంలో నడుస్తున్నాడు.

మాయాకిరాత యువకుడు తిరుమలనంబి తలపైనున్న కుండకు నేర్పుగా బాణంతో రంధ్రం చేసి, అందుండి కార్తున్న నీటిధారను దోసిట పట్టుకొని త్రాగుతూ తాతవెంట నడుస్తున్నాడు.

కొంతసేపటికి నీరు తగ్గడంతో బరువూ తగ్గింది. ఆసంగతి గమనించిన నంబి, ఎందుకింత తేలిక అయింది కుండ? అని వెనుదిరిగి చూచాడు. నీరు త్రాగుతుండే కిరాతుడు కన్పించాడు. తిరుమలనంబికి కోపం వచ్చింది. ”ఓరీ కిరాతా! ఎంతపని చేశావు స్వామివారి అభిషేక కైంకర్యానికి విఘ్నం కల్గించినావు. పెద్దవాణ్ణి మరలా వెళ్ళి ఆతీర్థం తెచ్చి యిచ్చే సరికి, అభిషేక సమయం దాటిపోతుంది. ఎం చేయాలి? దేవా! ఈ దాసుణ్ణి క్షమించు” అంటూ స్వామివారిని ప్రార్థించాడు.

ఆ కిరాతకుడు ”తాతా! నా దప్పిక తీరింది. నా వెంటరా దగ్గర్లోనే ఒక కోన తీర్థం వుంది. ఆ తీర్థం తీసుకెళ్ళి అభిషేకానికి అర్పించు” అన్నాడు. నంబి కిరాతుని వెంట వెళ్లాడు. అక్కడ తీర్థం కన్పించలేదు. వెంటనే కిరాతుడు ఒక బాణం వేసి, కొండకొమ్మును కొట్టాడు. అందుండి స్వచ్ఛమైన జలధార పెల్లుబికింది. ఆజలపాతాన్ని చూపిస్తూ యువకుడు ”తాతా! ఇది ఆకాశగంగ. ఈతీర్థాన్ని తీసుకెళ్లి స్వామికి అభిషేకాదులకు సమర్పించు. నీవు కృతార్థుడవవుతావు. ఇక మీదట కూడా ఈ ఆకాశగంగా తీర్థాన్నే నా అభిషేకానులకు సమర్పించు. పాపవినాశతీర్థానికి వెళ్లి. శ్రమ పడవద్దు”. ఆకిరాతుడు అదృశ్యుడయ్యాడు.

ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబైన తిరుమల నంబి, ఆ యువకుడు సాక్షాత్తు తిరువెంగడనాధుడే అని తెలిసికొని, తనను ”తాతా!” అని పిల్చినందుకు చాలా సంతోషించి, తన జన్మ చరితార్థం మయిందని అనందించాడు. స్వామి అదేశాలనుసారం తిరుమలనంబి ఆకాశగంగా తీర్థజలాన్ని తీసుకెళ్లి, సకాలంలో ఆలయానికి చేర్చాడు.

అప్పుడు అనందనిలయంలో శ్రీవారు ఒక అర్చకస్వామితో ఆవేసించి, ” ఓ తిరుమలనంబి తాతా! నీవు సమర్పించిన చల్లని నీటితో నా దప్పిక తీరింది. నీ తీర్థ సేవకు చాలా సంతోషించాను. ఇక మీదట నీవు ఆకాశగంగా తీర్థాన్నే తెచ్చి, నాకు అభిషేకాదులకు సమర్పించు”. అని ఆదేశించారు. ఇలా యమునాచార్యులవారి ఆదేశానుసారం శిష్యుడు తిరుమలనంబి తిరువేంగడనాథునికి  తీర్థకైంకర్యం చేసి ధన్యుడయ్యాడు. ఆనాటి నుండి ఆకాశగంగా తీర్థం శ్రీవారి నిత్యాభిషేకాదులకు అర్పితమవుతూంది.
ఇది జరిగింది – ధనుర్మాస ప్రారంభమైన 25వ రోజున కనుక స్వామివారు తిరుమలనంబి తెచ్చిన నీటిని స్వయంగా త్రాగినందుకు గుర్తుగా – పతి సంవత్సరం ఆరోజున ” ఆకాశగంగా తీర్థోత్సవం” జరుగుతూంది. ఈ ఉత్సవాన్ని వైష్ణవ సంప్రదాయంలో ”తన్నీరుముదు ఉత్సవం” (అమృత జలోత్సవం” అంటారు.
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు క్రీ.శ.1473-1553) ఆకాశగంగా జలపాతం వద్ద, వనభోజనోత్సవాన్ని తన ఉభయంగా ఏర్పాటు చేసి, 25-10-1537వ తిరుమలలో విలా శాసనం వేయించాడు. (శాసనం 100 – సంపుటం4. తితిదే శాసనములు 1998).

విశేషాలు:

ప్రతియుగంలో ఇలా ఎన్నో మహత్తర సన్నివేశాలు దివ్యక్షేత్రాల్లో సంభవిస్తూంటాయి.
హనుమంతుని జన్మ ఆకాశగంగ వద్దనే జరిగిందనీ, పుణ్యశీలుడనే వానికి గాడభముఖం పోయి, పూర్యవముఖం వచ్చింది – ఇక్కడేననీ, ఇలా ఎన్నో విశేషాలు ఈ తీర్థాన్ని గూర్చి వున్నాయి.

ముఖ్యంగా – శ్రీనివాసుడు తన అభిషేకం కోసం తానే తన దివ్యబాణంతో కొండకొమ్మును కొట్టి – నిర్మించుకొన్న పుణ్య తీర్థం – ఆకాశగంగ అందుకే తక్కిన తీర్థ జలానికంటే ఆకాశగంగాజలం స్వామికి ఎక్కువ ప్రీతి పాత్రం.

ఉపనిషత్తు పరమాత్మకు ‘ఆకాశమే శరీరం’ అని చెప్పింది. కనుక శ్రీవారి శరీరం ఆకాశం – అందుండి ఏర్పడిన తీర్థజలమే – స్వామివారి అభిషేకానికి యోగ్యం!
విష్ణువు పర్వతాలకు అధిపతి. కనుక పర్వతాన్ని ఛేదించి, అందుండి జలాన్ని ఆవిర్భవింపజేసి, తన అభిషేకానికి తానే, తన ఎనిమిది తత్త్వాల్లో ఒకటైన జలాన్ని సృష్టించుకొన్నాడు.

గంగా – అంటే హరిపాదం నుండి అంటే ఆకాశం నుంచి, భూమిని పొందింది అని వ్యుత్పత్తి. ఆకాశమంటే అంతటా ప్రకాశించేది అని అర్థం. పరమాత్మ సర్వత్ర వ్యాపించి, ప్రకాశిస్తుంటాడు. కనుక – ఆకాశమే ఆయనకు శరీరం.

విష్ణువు – నారాయణుడు జలం – నివాసంగా కల్గినవాడు. కనుక ఇతరులు ఏర్పాటు చేసింది కాక – తానే స్వయంగా ఏర్పరచిన దివ్యతీర్థం ఆకాశగంగం. ఇది ముక్తిదాయకం. ఇట్టి దివ్యతీర్థం ఏర్పడిన సన్నివేశాన్ని, అందుకు కారణమైన పరమకైంకర్యపరుడు తిరుమలనంబి గారినీ, అన్నిటికీ మూల కారణమైన తిరువెంగడనాథుణ్ణీ, అభిషేకజలస్థానమైన ఆకాశగంగనూ ఈ రోజు స్మరించి, సేవించడం వల్ల మహాపుణ్యం లభిస్తుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.