PUSHPAYAGAM PERFORMED IN SRI GT_ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో క‌న్నుల‌పండుగ‌గా పుష్పయాగం

Tirupati, 8 July 2019: The processional deities of Sri Govindaraja Swamy accompanied by Sridevi and Bhudevi were offered special floral bath – Pushpa yagam on Monday in the famous temple of Sri Govinda Raja Swamy located in Tirupati.

Earlier during the day, Snapana Tirumanjanam was rendered to the deities. Later in the afternoon from 1pm onwards, Pushpa Yagam commenced on a grand religious note. As a part of this special fete, the deities were seated on a special platform and floral tributes were rendered with tonnes of varieties of flowers, sacred leaves consisting both traditional and ornamental.

The entire fete was a cynosure to the devotees who thronged to catch up the significant charm of the deities in this unique festival.

TTD EO Sri Anil Kumar Singhal, CVSO Sri Gopinath Jatti, Special Grade DyEO Smt Varalakshmi and others took part in this fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో క‌న్నుల‌పండుగ‌గా పుష్పయాగం

తిరుపతి, 2019 జూలై 08: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ఎ.వి. శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఆల‌యానికి భ‌క్తుల రాక పెరుగుతోంద‌ని, స‌రాస‌రి రోజుకు 10 వేల నుండి 24 వేల మంది వ‌ర‌కు ద‌ర్శించుకుంటున్నార‌ని వెల్ల‌డించారు. తిరుమ‌ల‌కు వ‌స్తున్న భ‌క్తుల్లో మూడో వంతు మంది ఈ ఆల‌యానికి వ‌స్తున్నార‌ని వివ‌రించారు. ఇందుకు త‌గ్గ‌ట్టు ఆల‌యంలో భ‌క్తుల సౌక‌ర్యాలు మెరుగుప‌రుస్తున్నామ‌ని, భ‌ద్ర‌త పెంచుతున్నామ‌ని చెప్పారు. మే 11 నుండి 19వ తేదీ వరకు వరకు ఆల‌యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయ‌ని, భ‌క్తులు విశేషంగా పాల్గొన్నార‌ని తెలిపారు. ఈ బ్ర‌హ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంద‌న్నారు. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తుల‌సి, మ‌రువం, ద‌మ‌నం, బిల్వం, ప‌న్నీరాకు వంటి 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించార‌ని వివ‌రించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారని తెలిపారు.

ముందుగా టిటిడి ఈవో, ఇత‌ర అధికారులు క‌లిసి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి పుష్పాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. కాగా సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, విఎస్వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఉద్యానవ‌న‌ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీనివాసులు, ఏఇవో శ్రీ ర‌విప్ర‌కాష్‌రెడ్డి, ఎవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌, శ్రీ శ్రీ‌హ‌రి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ ప్ర‌శాంత్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.