R-DAY OBSERVED WITH PATRIOTIC FERVOUR _ టీటీడీ పరిపాలనా భవనంలో మువ్వన్నెల జెండా రెపరెపలు
టీటీడీ పరిపాలనా భవనంలో మువ్వన్నెల జెండా రెపరెపలు
తిరుపతి, 2023 జనవరి 26: తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ విశ్వనాధం పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టిటిడి ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 32 మంది అధికారులు, 237 మంది ఉద్యోగులకు, ఎస్విబిసి లో 5 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు.
ప్రత్యేక ఆకర్షణగా టిటిడి జాగిలాల ప్రదర్శన :
టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి శ్రీ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. విరాట్, శింబా, ఇందు, హంటర్, వర్ష, బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి.
ఇందులో గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “సుమనస వందిత…..”, ” జన జాగృత నవ భారత నవోదయం…”, “తిరువీధులలో మెరసే దేవదేవుడు…..” తదితర దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి, వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం,
సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, డిఎల్ఓ శ్రీ రెడ్డప్పరెడ్డి, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజి, అదనపు సివిఎస్వో శ్రీ శివ కుమార్ రెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.