REJOINDER TO THE ADVERSE REPORTS THAT APPEARED IN SOME VERNACULAR DAILIES ON AUGUST 15_ ఆగస్టు 15వ తేదీన ”ఆంధ్రజ్యోతి”, ”ఈనాడు”, ”సాక్షి” దినపత్రిక నందు ప్రచురించిన ‘టిటిడి జెఈఓకు సిబిసిఐడి నోటీసులు’ అనే వార్తకు వివరణ
ఆగస్టు 15వ తేదీన ”ఆంధ్రజ్యోతి”, ”ఈనాడు”, ”సాక్షి” దినపత్రిక నందు ప్రచురించిన ‘టిటిడి జెఈఓకు సిబిసిఐడి నోటీసులు’ అనే వార్తకు వివరణ
తిరుపతి, 2012 ఆగస్టు 24: ఆగస్టు 15వ తేదీన ”ఆంధ్రజ్యోతి”, ”ఈనాడు”, ”సాక్షి” దినపత్రిక నందు ప్రచురించిన ‘టిటిడి జెఈఓకు సిబిసిఐడి నోటీసులు’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సేవించుకునేందుకు విచ్చేసే భక్తుల కొరకు తితిదే విక్రయిస్తున్న ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు వ్యవహారంలో, అలాగే ఇతర దర్శన విషయాల్లో తితిదే ఒక నిర్దిష్టమైన విధానాన్ని అమలు చేస్తున్నది. అయితే ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు వ్యవహారంలో జెఈఓ కార్యాలయంలోని ఒక కిందిస్థాయి ఉద్యోగి ఆర్జిత సేవా టికెట్లను అక్రమంగా కేటాయిస్తున్నారని ఒక అజ్ఞాత వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు సిబిసిఐడి జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుకు నోటీసులు జారీ చేసిందని, వాటిని తీసుకోవడానికి ఆయన నిరాకరించారని సదరు వార్తలో పేర్కొన్న విషయాలు పూర్తిగా అవాస్తవం.
తిరుమలలో పరిపాలన వ్యవహారాలు, భక్తుల వసతి, దర్శనం, ఇతర సేవల విధానాలను పర్యవేక్షిస్తున్న శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాది నాలుగు నెలల వ్యవధిలోనే భక్తులకు వసతి, దర్శనం, సేవాటికెట్లు కేటాయించే విధానంలో అధునాతన పద్ధతులను ప్రవేశపెట్టి పారదర్శకతకు పెద్దపీట వేశారన్నది బహిరంగ సత్యం. అటువంటి ఒక ఉన్నతాధికారిపై వారిని సంప్రదించకుండా, వారి వివరణ తీసుకోకుండా ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో అవాస్తవాలను ప్రచురించడం దురదృష్టకరం. ఇటువంటి వార్తలు ప్రచురించడం ద్వారా హైందవ మత ప్రతిష్టను కించపరచడమే గాకుండా భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసేవిధంగా ఉన్నది.
కనుక పైతెల్పిన వాస్తవాల్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సినదిగా కోరడమైనది.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి