RESTORATION WORKS OF SRIVARI PADALU TO COMMENCE ON SEPT 18 _ నారాయణగిరిలో నూతన శ్రీవారి పాదాలు : జెఈవో
నారాయణగిరిలో నూతన శ్రీవారి పాదాలు : జెఈవో
తిరుమల, సెప్టెంబరు 17, 2013: తిరుమల శేషాచల పర్వతశ్రేణుల్లో అత్యంత ఎత్తయిన శిఖరంగా పేరుగాంచిన నారాయణగిరిలో నూతన శ్రీవారి పాదాల ఏర్పాట్లు బుధవారం చేపడుతున్నట్టు తితిదే తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు తెలిపారు.
తిరుమలలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి శ్రీవారి పాదాలను దర్శించుకునేందుకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారని తెలిపారు. కొన్ని రోజుల కిందట శ్రీవారి పాదాలకు భిన్నత్వం ఏర్పడినట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు, అప్పట్లో శ్రీవారి పాదాల స్థపతి శ్రీ లక్ష్మీనారాయణను సంప్రదించి నూతన శ్రీవారి పాదాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తుల సందర్శనను నిలుపుదల చేస్తున్నట్టు చెప్పారు. బుధవారం నాడు ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం నూతన పాదముద్రలను స్థాపిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి భిన్నత్వం కలగకుండా శ్రీవారిపాదాలపై రెండు వారాల్లో పగలని గాజు కవచాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయిన తరువాత తిరిగి ఎప్పటినుండి భక్తులను అనుమతిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామన్నారు.
శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన డాక్టర్ ఎ.వి.రమణదీక్షితులు మాట్లాడుతూ నారాయణగిరి శిఖరంపై వెలసియున్న శ్రీవారి పాదాలను పూర్వీకులు రూపొందించినట్టు తెలిపారు. ఈ పాదాలకు ఎటువంటి ప్రత్యేక ఆరాధనా విధానం ఆతమశాస్త్రాల్లో లేదన్నారు. ఇది ఒక చారిత్రక వైశిష్ట్యం గల ప్రదేశమని వివరించారు. అయితే భిన్నత్వాన్ని నివారించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు తిరిగి నూతన పాదాల ఏర్పాటుకు ఒక శుభముహూర్తం నిర్ణయించినట్టు తెలిపారు. తితిదే ఆగమ సలహాదారు శ్రీ సుందరవదనాచార్యులు మాట్లాడుతూ బుధవారం ఉదయం 6.00 నుండి 7.30 గంటల మధ్య కన్యాలగ్నంలో నూతన శ్రీవారి పాదాల ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇది విశేషమైన ముహూర్తమని, బుధవారం శ్రీ అనంతపద్మనాభస్వామివారి జయంతి కూడా కావడం విశేషమన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.