విజయవాడ శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం

విజయవాడ శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం

విజయవాడ, 2017 జూలై 05: విజయవాడలో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.

విజయవాడలోని పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు

సుప్రభాతం, ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9.00 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు.

సహస్రకలశాభిషేకం : ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు

భోగశ్రీనివాసమూర్తితోపాటు, శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారికి వెయ్యి కలశాలతో సహస్రకలశాభిషేకం నిర్వహించారు. బంగారువాకిలి నందు ఉత్సవమూర్తులను

ఉత్తరాభిముఖంగా ఉంచి, భోగశ్రీనివాసమూర్తిని తూర్పుముఖంగా ఉంచారు. మూలమూర్తినుండి కట్టబడిన పట్టుదారంతో భోగ శ్రీనివాస మూర్తిని బంగారువాకిలినందు ఉంచుతారు.

పాలు-పెరుగు-తేనె-పసుపు-చందనము మొదలగు ద్రవ్యాలతో అభిషేకం, విశేషహోమం-నైవేద్యము జరిపి భక్తులను ఆశీర్వదిస్తారు. సహస్ర(1000) కలశాలు స్వామి వార్ల యొక్క అభిషేకంలో ఉపయోగించారు. కావున, ఈ సేవకు ‘సహస్ర కలశాభిషేకం’ అనే పేరు ఏర్పడింది. ఈ సహస్రకలశాభిషేకం ఉత్తమోత్తమ అభిషేక విధానమని ఆగమశాస్త్రంలో చెప్పబడింది.

అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు తొమాలసేవ, అర్చన నిర్వహంచారు. 11.30 నుంచి 11.45 గంటల వరకు రెండో నివేదన, ఉదయం 11.45

నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకరణసేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.15 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు ఏకాంత సేవ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు గౌ|| శ్రీ వెంకయ్యనాయుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గౌ|| శ్రీ కామినేని శ్రీనివాస్‌, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

జూలై 6వ తేదీ గురువారం నమూనా ఆలయంలో కార్యక్రమాలు

శ్రీవారి నమూనా ఆలయంలో గురువారం ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, 7.00 గంటలకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8.00 గటలకు అర్చన నిర్వహిస్తారు.

తిరుప్పావడసేవ – ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు….

చిత్రాన్నమును (పులిహోరను) రాశిగా పోసి మూలమూర్తికి ఎదురుగావున్న గరుడుని యొక్క స్థానమందు ఉంచి స్వామికి నైవేద్యం చేయుటను ‘తిరుప్పావడ’ అని అంటారు. ఇది గురువారపు ఆర్జితసేవ.

దేశ ప్రజలందరూ పాడిపంటలతో సుఖంగా ఉండాలని, ఆహారానికి ఎటువంటి ఇబ్బందీ రాకూడదని, సర్వసౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు అభివృద్ధి పొందాలని, ఎటువంటి ఈతి బాధలు కలుగ కూడదని సంకల్పాన్ని చెప్పి తిరుప్పావడ సేవను ఆచరిస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

ఇందులో భాగంగా సాయంత్రం 4.00 నుంచి 6.30 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీ మల్లాది బ్రదర్స్‌ బృందం భక్తి సంగీతం, రాత్రి 7.00 నుండి 8.15 గంటల వరకు

హైదరాబాద్‌కు చెందిన శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి ధార్మిక ఉపన్యాసం ఇవ్వనున్నారు.


తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.