SAKSHATKARA VAIBHAVAM- Procession of HANUMANTHA VAHANAM _ వైభవంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
DyEO Smt Reddamma, Temple staff and devotees took part
వైభవంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
తిరుపతి, జూలై 13, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు రెండవ రోజైన శనివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. ఉదయం 10.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కళ్యాణమంటపంలోని వేంచేపు చేసి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామివారి ఊంజల్‌సేవ కన్నుల పండువగా జరిగింది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, సూపరింటెండెంట్లు శ్రీ కృష్ణారావు, శ్రీ దినకర్‌రాజు, ఇతర అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జూలై 14 వ తేదీన గరుడవాహనంపై ఊరేగనున్న స్వామివారు:
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలలో చివరి రోజైన ఆదివారం రాత్రి 8.00 గంటల నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామివారు భక్తులకు అభయమివ్వనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.