ఎస్వీ వేద వర్సిటీలో శ్రీ సరస్వతీయాగానికి ఏర్పాట్లు పూర్తి

ఎస్వీ వేద వర్సిటీలో శ్రీ సరస్వతీయాగానికి ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2018 జనవరి 27: టిటిడి, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీ ఆదివారం భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీ సరస్వతీయాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో మరియు వర్సిటీ ఉపకులపతి శ్రీ పోల భాస్కర్‌ ఆదేశాల మేరకు ఈ యాగం నిర్వహిస్తున్నామని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వర్సిటీ కులసచివులు శ్రీ పి.విశ్వనాథ శనివారం ఒక ప్రకటనలో కోరారు.

వర్సిటీ ప్రాంగణంలోని శ్రీమహావిష్ణుయాగశాలలో ఆచార్య అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ యాగం జరుగనుంది. 2018వ విద్యాసంవత్సరంలో పరీక్షలు రాయబోవు విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, జ్ఞానసమృద్ధి, విజ్ఞాన వికాసం, ఉన్నతస్థితి సాధనతోపాటు అందరికీ సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఈ యాగం నిర్వహించనున్నారు. కావున తిరుపతిలోని విద్యార్థులందరూ ఈ యాగంలో పాల్గొని సరస్వతీ కంకణం ధరించి, సరస్వతీ మంత్రం జపించాలని వర్సిటీ అధికారులు కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.