SCHOLARS TRIBUTES PAID TO RALLAPALLE ANANTA KRISHNA SHARMA _ శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి : ఆచార్య రాళ్లపల్లి దీప్త

Tirupati, 11 March 2023: On the 44th death anniversary of renowned scholar Sri Rallapalle Anantakrishna Sharma, scholars recalled his impeccable services.

 

The event was held at Annamacharya Kalamandiram in Tirupati in Saturday evening, 

Scholars lauded the services of the eminent scholar who framed lovable tunes to the multitude of popular Annamacharya Sankeertans.

 

Earlier during the day the live statue of Sri Rallapalle located at Sri Padmavathi Mahila University junction road with garlands.

 

Chief Audit Officer Sri Sesha Sailendra, Annamacharya Project Director Dr Vibhishana Sharma, successors of Sri Rallapalle, Sri Syama Sundar, Sri Nandanandana and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి : ఆచార్య రాళ్లపల్లి దీప్త

– ఘనంగా శ్రీ అనంతకృష్ణశర్మ 44వ వర్ధంతి

తిరుపతి, 2023 మార్చి 11: సంగీత, సాహిత్య రంగాల్లో అపారమైన జ్ఞానం ఉన్న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన మనవరాలు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్త కొనియాడారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం రాత్రి శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 44వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆచార్య రాళ్లపల్లి దీప్త అధ్యక్షోపన్యాసం చేస్తూ శ్రీ రాళ్లపల్లి వారికి సంగీతం, సాహిత్యం రెండు కళ్లు లాంటివని, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచారని తెలిపారు. రాగి రేకుల్లో పేర్కొన్న రాగాలతోనే స్వరపరిచారని, ఈ రాగాలు ప్రస్తుతం లేకపోయినా అన్నమయ్య కాలం నాటి సమకాలీన సంగీతాన్ని దృష్టిలో ఉంచుకుని బాణీలు కూర్చారని తెలియజేశారు. ఈయనకు సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, కన్నడ భాషల్లో మంచి పాండిత్యం ఉందని, ఈ కారణంగానే అన్నమయ్య రాగిరేకుల్లోని సాహిత్యాన్ని చక్కగా అర్థం చేసుకుని పరిష్కరించారని చెప్పారు. అప్పటి ఈవో శ్రీ పివిఆర్కె ప్రసాద్ చేతులమీదుగా టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియామకమైన రోజే శ్రీ అనంతకృష్ణ శర్మ పరమపదించారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

  తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లక్ష్మణ చక్రవర్తి “శ్రీరాళ్లపల్లి వారి సంగీత వరివస్య ” అనే అంశంపై మాట్లాడుతూ శ్రీ రాళ్లపల్లి వారికి ఎక్కువ భాషలు తెలిసి ఉండడం, రాయలసీమ వ్యక్తి కావడం, వైష్ణవతత్వంపై అవగాహన ఉండడంతో అన్నమయ్య రాగిరేకుల్లోని కీర్తనలను ఎంతో ప్రామాణికంగా వెలుగులోకి తీసుకొచ్చారని తెలియజేశారు.

శ్రీ రాళ్లపల్లివారి మనవడు, ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు శ్రీ ఆర్‌.నందనందన శ్రీ అనంత కృష్ణ శర్మ స్వరపరచిన పలు అరుదైన సంకీర్తనలను తన వేణువుపై పలికించి సభికులను ఆకట్టుకున్నారు.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ మాట్లాడుతూ 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను శ్రీ రాళ్లపల్లివారికి టీటీడీ అప్పగించిందన్నారు. రేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టిన ఘనత వీరికే దక్కిందన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారని తెలిపారు.

కాగా, ఉదయం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మార్గంలోని శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర, ఎస్వీయు విశ్రాంతాచార్యులు ఆచార్య సర్వోత్తమరావు, శ్రీ రాళ్లపల్లి శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.