SNAPANAM PERFORMED TO SRI RAMA_ శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం

Tirumala, 25 March 2018: In connection with Sri Rama Navami on Sunday, the Snapana Tirumanjanam to Sita, Lakshmana, Anjaneya Sametha Sri Rama Chandra Murthy took place in Tirumala temple.

After Punyahavachanam, the utsava murthies of the deities were offered the holy bath in Ranganayakula Mandapam with milk, honey, curd, tender coconut water and turmeric.

The entire premises vibrated with devotional vibes and echoed with Sri, Bhu, Nila, Purushasuktams rendered by vedic scholars when snapanam is on.

Tirumala Pedda Jiyar Swamy, TTD Executive Officer Sri Anil Kumar Singhal and other temple officials took part in the celestial event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం

మార్చి  25,  తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారంనాడు శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చనను ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.  

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయములో అనుసంధానము చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.  

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజియర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

హనుమంతునిపై శ్రీ వేంకటాద్రిరాముడు  

ఆదివారం రాత్రి 7.00 నుండి 9.00 గంటల నడుమ శేషాచలాదీశుడు శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. 

శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీరాముడిగా భావించి, శ్రీవారి సుప్రభాతాన్ని రచించిన శ్రీ హస్తిగిరినాథన్‌ ”కౌసల్యా సుప్రజా రామ..” అంటూ స్తుతించారు. రామాయణంలోని శ్రీరాముడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడే ఈ యుగంలో శ్రీనివాసుడు. కావున శ్రీవారు వేంకటరాముడు, వేంకట కృష్ణుడు, వేంకటాచలపతి,  ఇలా త్రివేణిసంగమయిన సేవ హనుమంత వాహనసేవ. 

దాస్యభక్తుల్లో హనుమంతుడు పేరెన్నికగన్నవాడు. వేదాలూ, వ్యాకరణాలూ సమస్తమూ క్షుణ్ణంగా తెలిసినవాడు. హనుమంతున్ని సేవిస్తే, రోజూ భక్తితో దర్శిస్తే, భక్తులకు బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్బయత్వం, ఆరోగ్యం, చైతన్యం, మంచి వాక్‌శక్తి సిద్ధిస్తాయి. అందుకే హనుమంతుడు భక్తులతో ” మీకు కావలసిన భౌతిక, ఆధ్యాత్మిక, ధార్మిక ఫలాలన్నీ నేనే ఇస్తా, మోక్షం మాత్రం నాస్వామి రామయ్యనే సేవించి పొందండి” అన్నాడు. కనుక హనుమంతునిపైనున్న శ్రీవారిని దర్శించడంతో ఇహమేకాక పరమమైన మోక్షంకూడా లభిస్తుంది. 

హనుమంతవాహనోత్సవం ప్రతి వ్యక్తీ హనుమంతునివలె నిష్కళంక హృదయం, నిస్వార్థసేవా తత్పరత, ప్రభుభక్తి పరాయణత, సచ్చీలం మున్నగు సుగుణ సంపత్తి కల్గి ఉంటే భగవంతునికి మిక్కిలి సన్నిహితులై స్వామి కృపకు సర్వదా పాత్రుడవుతాడు. 

శ్రీరామనవమి ఆస్థానం

అనంతరం రాత్రి 10.00 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.