శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం ఫిబ్రవరి 23న అంకురార్పణం

తిరుపతి, 2019, ఫిబ్రవరి 22: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం ధ్వజారోహణంతో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 7.00 నుండి 8.45 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 9.00 నుండి 9.18 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.

ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

భక్తులకు అన్నప్రసాదాలు :

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. వాహనసేవల సమయంలో భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు, తాగునీరు అందించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి రోజుకు 3 వేల చొప్పున లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. భక్తులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యశిబిరం ఏర్పాటుచేశారు.

ప్రదర్శనశాలలు సిద్ధం :

భక్తులు వీక్షించేందుకు వీలుగా పలు స్వామివారు ఊరేగే వాహనాలతో ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు. అదేవిధంగా భక్తుల కొర‌కు టిటిడి పుస్తకవిక్రయశాల, మీడియా సెంటర్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

పరిసర గ్రామాల్లో ధర్మప్రచార రథం :

బ్రహ్మోత్సవాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు పరిసర గ్రామాల్లో ధర్మప్రచార రథం పర్యటిస్తోంది. ఇందులో కరపత్రాలను పంపిణీ చేసి భక్తులను ఆహ్వానిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రచార రథం బ్రహ్మోత్సవాలపై ప్రచారం చేస్తున్నారు.

ఆకట్టుకునేలా అలంకరణలు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి దాదాపు 5 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీజాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహనసేవల్లో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.