TYAGARAJA ARADHANA ON JAN 6_ జనవరి 6న తిరుపతి, కాకర్లలో శ్రీత్యాగరాజస్వామి 171వ ఆరాధనోత్సవాలు

Tirupati, 3 January 2018: The Temple management of TTD is all set to observe 171st Aradhanotsavams of Saint Musician Sri Tyagaraja Swamy on January 6 in a big way in Kakarla and Tirupati.

In Kakarla, the home turf of Sri Tyagaraja Swamy in Prakasam district, the festival will be observed in Dhyana Mandiram.

While in Tirupati, special abhishekam will be performed to the saint poet statue in SV college of music and dance. A processsion from the college premises to Mahati auditorium follows and the artistes will render Tyagaraja sankeertans.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 6న తిరుపతి, కాకర్లలో శ్రీత్యాగరాజస్వామి 171వ ఆరాధనోత్సవాలు

తిరుపతి, 2018 జనవరి 03: ప్రముఖ వాగ్గేయకారుడైన కర్ణాటక సంగీత సామ్రాట్‌ శ్రీత్యాగరాజస్వామివారి 171వ ఆరాధనోత్సవాలను జనవరి 6వ తేదీ శనివారం వారి స్వస్థలమైన ప్రకాశం జిల్లా కాకర్లలోనూ, తిరుపతిలోనూ టిటిడి ఘనంగా నిర్వహించనుంది. శ్రీత్యాగరాజస్వామివారు పుష్యబహుళ పంచమి నాడు పరమపదించారు. టిటిడి శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాగ్గేయకార వైభవం కార్యక్రమంలో భాగంగా టిటిడి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

తిరుపతిలో...

తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ఉదయం 8.30 గంటలకు సద్గురు శ్రీత్యాగరాజస్వామివారి పంచలోహవిగ్రహానికి పంచామృతాభిషేకం, పూజలు నిర్వహిస్తారు. అక్కడినుంచి మేళతాళాలతో నగర సంకీర్తనగా మహతి కళాక్షేత్రానికి చేరుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం నాదస్వరం, డోలు వాద్యం, త్యాగరాజ రామాయణం కార్యక్రమంలో భాగంగా బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు కొన్ని కృతులను గానం చేస్తారు. మధ్యాహ్నం ఉత్సవ సంప్రదాయ, దివ్యనామ సంకీర్తనల బృందగానం నిర్వహిస్తారు. సాయంత్రం వీణ, వేణువు, మృదంగ వాద్యసంగీతం, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి పంచరత్న కృతులను బృందగానం చేస్తారు. రాత్రి త్యాగరాజ యోగ వైభవం హరికథ పారాయణం ఉంటుంది.

కాకర్లలో…

ప్రకాశం జిల్లా కాకర్లలోని శ్రీత్యాగరాజస్వామివారి ధ్యానమందిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు కలిసి శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్న కృతులను గానం చేస్తారు.

శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.