SUMMER RUSH ARRANGEMENTS AND OTHER FESTIVALS _ తిరుమలలో వేసవి ఏర్పాట్లు
జూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు
– టిటిడి చేస్తున్న సేవలను అభినందించిన గౌ.రాష్ట్ర గవర్నర్
– డయల్ యువర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 03 ఏప్రిల్ 2024: తిరుమలలోని ఆకాశగంగ వద్ద శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో జూన్ 1 నుండి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి టిటిడి పరిపాలన భవంలోని మీటింగ్ హాల్‌లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.
తిరుమలలో వేసవి ఏర్పాట్లు :
– వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాం.
– క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నాం.
– ఆలయ మాడ వీధుల్లో, భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ, ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేశాం. నేలపై నీళ్లతో ఎప్పటికప్పుడు పిచకారి చేస్త్తున్నాం.
– నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేశాం.
జూన్ 1 నుండి 5వ తేదీ వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు
– తిరుమలలోని ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో జూన్ 1 నుండి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం.
– ఇందులో భాగంగా జూన్ 1న శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి విశేషంగా తిరుమంజనం, 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– హనుమత్ జయంతి సందర్భంగా ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయస్వామివారికి విశేష అభిషేక, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– హనుమంతుని జన్మ విశేషాలు, ఇతర అంశాలను ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నాం.
– భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.
– తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్ 2న ఉదయం సూర్యోదయంతో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమవుతుంది. సుందరకాండలోని మొత్తం 2,872 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారు.
టిటిడి విద్యాసంస్థల్లో ఉత్తమ ఫలితాలు
– టిటిడి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యరంగాల్లో ఇతోధిక సేవలు అందిస్తోంది.
– ఇటీవల విడుదలైన ఇంటర్మీడియేట్, పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టిటిడి కళాశాలలు, ఉన్నత పాఠశాలలు 98 శాతం ఫలితాలు సాధించాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ఇందుకు కృషి చేసిన జేఈవో, డిఈవో, ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్లు ఇతర బోధనా సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
టిటిడి చేస్తున్న సేవలను అభినందించిన గౌ.రాష్ట్ర గవర్నర్
– టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రులను రాష్ట్ర గవర్నర్ గౌ.శ్రీఎస్.అబ్దుల్ నజీర్ ఏప్రిల్ 26వ తేదీ సందర్శించారు.
– బర్డ్‌లో నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందిస్తున్న చికిత్స, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల గౌ.రాష్ట్ర గవర్నర్ అభినందించారు.
– ఒక సంవత్సరంలో 14 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు 2500కు పైగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు.
మొట్టమొదటిసారిగా ‘‘గోవింద కోటి’’ని రాసిన బెంగుళూరుకు చెందిన కుమారి కీర్తన
– మొట్టమొదటిసారిగా బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు ‘‘గోవింద కోటి’’ని రాసింది. శ్రీవారి అనుగ్రహంతో కుమారి కీర్తన ఉజ్వల భవిష్యత్ పొందాలని స్వామివారిని ప్రార్థిసున్నాను.
శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు :
– మే 17 నుండి 19వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు.
– మే 22న తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం.
శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 21 నుండి 23వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం.
– మే 22న ఉదయం 7.45 గంటల నుండి అమ్మవారి బంగారు రథోత్సవం జరుగుతుంది.
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పత్ర పుష్పయాగం
– మే 23న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పత్ర పుష్పయాగం నిర్వహిస్తాం.
శ్రీ తాళ్ళపాక అన్నమయ్య జయంతి
– మే 23న శ్రీతాళ్ళపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలను తాళ్ళపాక, తిరుపతిలలో ఘనంగా నిర్వహిస్తాం.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు
– శ్రీనివాసమంగాపురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 27 నుండి 29వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం.
– మే 28న సాయంత్రం 6 గంటల నుండి స్వామి, అమ్మవార్లు బంగారు రథంపై విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు.
ఈ కార్యక్రమంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబిసి సిఈవో శ్రీ షణ్ముఖకుమార్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ – 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.