SURYA PRABHA VAHANAM_ సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ప్రకాశం

Appalayagunta, 29 June 2018: Lord Sri Prasanna Venkateswara Swamy took celestial ride on Surya Prabha Vahanam on the bright sunny day on Friday.

The vahanam glided along the streets surrounding the temple at Appalayagunta.

Lord as Suryanarayanamurthy blessed the devotees who converged to witness the grandeur of procession.

Temple Special Grade DyEO Sri Munirathnam Reddy, AEO Sri Subrahmanyam, Superintendent Sri Gopala krishna Reddy took part in the fete.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి ప్రకాశం

తిరుపతి, 2018 జూన్‌ 29: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం స్వామివారు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో కటాక్షించాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఓషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే శ్రీ ప్రసన్న సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

చంద్రప్రభ వాహనం :

రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం, పాపహరం.

జూన్‌ 30న రథోత్సవం

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 7.45 కర్కాటక లగ్నంలో గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 8.30 నుండి 10.00 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాకృష్ణ, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, ఆలయ కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.