TANNIRAMUDU FESTIVAL HELD_ తిరుమలలో ఘనంగా ”తిరుమలనంబి తన్నీరు అముదు” ఉత్సవం

Tirumala, 11 January 2018: The 25-day Adhyayanotsavms concluded on a religious note in Tirumala on Thursday evening with Tanniramudu utsavam.

As a part of it, the holy waters from Akasa Ganga was brought and placed at vahana mandapam, where the processional deities are kept after sahasra deepalankara seva. Later the water is taken inside the temple for Padabhishekam of presiding deity.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమలలో ఘనంగా ”తిరుమలనంబి తన్నీరు అముదు” ఉత్సవం

శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుమల, 11 జనవరి 2018: శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీ వేంకటేశ్వరుని సేవలోనే తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి సేవల స్మృత్యర్థం ప్రతి ఏడాది నిర్వహించే తిరుమలనంబి ”తన్నీరముదు” ఉత్సవాన్ని తిరుమలలో గురువారంనాడు అత్యంత ఘనంగా నిర్వహించారు.

అధ్యయనోత్సవాలు గత ఏడాది డిశెంబరు 18 తేదీన ప్రారంభమై గురువారం వరకు 25 రోజుల పాటు జరిగాయి.

ఈ ఉత్సవాన్ని సాధారణంగా అధ్యయనోత్సవాల చివరి రోజున నిర్వహించడం ఆనవాయితి. గురువారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీమలయప్పస్వామివారు తిరుమాడ వీధి ఆలయ ప్రదక్షిణంగా వాహనమండపానికి వేంచేపు చేశారు. తిరుమలనంబి ఆలయమునకు వీధి ప్రదక్షిణముగా ఆలయ మర్యాదలతో తిరుమలనంబి వంశీకులు శిరస్సుమీద ఆకాశగంగ తీర్థాన్ని బిందెలలో వాహనమండపానికి మోసుకువచ్చిన అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ గాయకులు, వైష్ణవులు, దేవస్థాన అధికారులు ఆలయంలోనికి పవిత్ర తీర్థ జలంతో వేంచేపు చేశారు.

అనంతరం తిరుమలనంబి వంశీకులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరిఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకించారు. ఈ సందర్భంగా వైదికులు తిరుమలనంబి రచించిన ”తిరుమొళి పాశురాలను” పారాయణం చేశారు.

ఈ కార్యక్రమంలో జీయర్‌స్వాములు, తోళప్పచార్యుల వంశీకులు ఆలయ అర్చకులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

చారిత్రక ప్రాశస్థ్యం

చారిత్రక ప్రాశస్థ్యం మేరకు శ్రీ తిరుమలనంబి క్రీ.శ. 973వ సంవత్సరంలో పవిత్ర పురట్టాసి మాసంలో అనూరాధ నక్షత్రమందు జన్మించారు. వీరు సాక్షాత్తు శ్రీ భవగవత్‌ రామానుజాచార్యులవారికి మేనమామ కూడా. ఈయన రోజూ పాపవినాశ తీర్థమునుండి కుండలో నీరు తీసుకొనివచ్చి శ్రీవారి ఆలయంలో స్వామివారికి దైనందిన పాదపూజ నిర్వహించేవారు. ఒకరోజు తిరుమలనంబి యధా ప్రకారం స్వామివారి సేవకై పాపవినాశనం నుండి జలాన్ని కుండలో మోసుకొని వస్తుండగా సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామి వేటగాని రూపంలో వచ్చి నంబిని ”తాతా” (అయ్యా) అని పిలుస్తూ దాహంతీర్చుకోవడానికి ఆ బిందెలోని నీటిని కోరాడు. అయితే స్వామి సేవకు వినియోగించే నీరుకావడంతో తిరుమల నంబి ఇవ్వననడంతో, బిందెను రంధ్రంచేసి అందునుండి వచ్చిన నీటిని త్రాగి వేటగాని రూపంలోఉన్న స్వామి సంతృప్తిని పొందాడు. అయితే ఈ చర్యతో ఖిన్నుడైన తిరుమలనంబిని చూసి స్వామి ఓదార్చుతూ సమీపంలో ఉన్న కొండపై బాణం వేసి అందులోనుండి తీయని పానీయం వచ్చేలాగా చేసాడు. నంబిని ఉద్ద్యేశించి స్వామి మాట్లాడుతూ ”ఇకపై ఈ తీర్థ జలాన్నే నాసేవకు ఉపయోగించాలని పలికి” అంతర్థానమైనారు. అప్పుడు తనకు ప్రత్యక్షమైన వ్యక్తి మరెవరోకాదు తాను నిత్యం ఆరాధించే సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామియేనని తిరుమలనంబి గ్రహించి ఎంతో ఆనందం చెందాడు. అప్పటి నుండి ఈ తీర్థానికి ఆకాశగంగ అనే నామంకల్గినది. ఈ తీర్థంయొక్క నీళ్ళు తీపిగా, అమృతమయంగా ఉండడంతో దీనినే ”తన్నీరముదు” అని కూడా వ్యవహరించడం జరిగింది.

భగవత్‌ శ్రీ రామానుజాచార్యులవారు సుమారు 1000 సంవత్సరాల క్రిందట శ్రీవారి ఆలయంలో తన్నీరముదు ఉత్సవాన్ని తిరుమలనంబి స్వామివారికి అందించిన విశేషసేవల జ్ఞాపకార్థం ప్రవేశపెట్టారు. అప్పటినుండి తిరుమలనంబి వంశీకులు ”తాతాచార్య” వంశస్థులు ప్రతి ఏడాది తిరుమలలో ఈ ఉత్సవాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.