తిరుపతిలో ఘనంగా శ్రీ త్యాగరాజస్వామివారి 172వ ఆరాధనోత్సవాలు వాగ్గేయకార చక్రవర్తికి సంకీర్తనల స్వరమాల

తిరుపతిలో ఘనంగా శ్రీ త్యాగరాజస్వామివారి 172వ ఆరాధనోత్సవాలు వాగ్గేయకార చక్రవర్తికి సంకీర్తనల స్వరమాల

తిరుపతి, 2019 జనవరి 25: వాగ్గేయకార చక్రవర్తి సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం సంకీర్తనల స్వరమాల వేసి నివాళులు అర్పించింది. ఆయన 172వ పుష్యబహుళ పంచమి ఆరాధనోత్సవాన్ని శుక్ర‌వారం ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీవేంకటేశ్వర నాదస్వర పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో సంగీత విద్వాంసులు, క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ముందుగా ఉదయం 8.00 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వ‌ర‌, హ‌నుమ‌త్స‌మేత సీతారామ‌ల‌క్ష్మ‌ణుల‌కు, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, శ్రీత్యాగరాజస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులతో మంగళవాయిద్య నీరాజనం సమర్పించారు.

అనంతరం ఉదయం 10.00 నుండి 11.15 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర నాదస్వ‌ర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులచే నాదస్వర కచ్చేరి నిర్వహించారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు శ్రీ ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులచే ”శ్రీ త్యాగరాజ విరచిత సంపూర్ణరామాయణ కృతులు” సుమధురంగా ఆలపించారు.

కాగా, మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 4.15 గంటల వరకు ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే నాదస్వర కచ్చేరి నిర్వహించారు. సాయంత్రం 4.30 నుంచి 5.15 గంటల శ్రీ ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులచే ”శ్రీ త్యాగరాజ విరచిత ఉత్సవ, దివ్యనామ సంకీర్తనల” బృందం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు వీణ, వేణువు, మృదంగం, తదితర వాయాద్యాలతో నాదనీరాజనం నిర్వహించారు.

తిరువయ్యారు తరహాలో పంచరత్న కృతుల బృందగానం :

శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవర్ల సమక్షంలో తమిళనాడులోని తిరువయ్యారు తరహాలో నిర్వహించిన శ్రీత్యాగరాజస్వామివారి ఘనరాగ పంచరత్న కృతుల బృందగానం సంగీతప్రియులను అలరించింది. పంచరత్న కృతుల్లో ”జగదానందకారక – జయజానకి ప్రాణనాయక” – నాటరాగం, ”దుడుకుగల నన్నేదొర కొడుకు బ్రోచురా? ఎంతో!” – గౌళరాగం, ”సాధించెనే ఓ మనసా! (సమయానికి తగుమాటలాడెనె!)” – ఆరభిరాగం, ”కనకనరుచిరా! కనక వసన నిన్ను….”- వరాళిరాగం, ”ఎందరో మహానుభావులు – అందరికి వందనములు” – శ్రీరాగం కీర్తనలున్నాయి.

అనంతరం రాత్రి 8.15 నుంచి 9.15 గంటల వరకు ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల హరికథా విభాగం ఆధ్వ‌ర్యంలో ”శ్రీ త్యాగరాజ యోగ వైభవం” హరికథా పారాయణం చేయనున్నారు. చివరగా మహా మంగళహారతి అనంతరం ప్రసాద వితరణ చేస్తారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి, కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పుర ప్రజలు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.