TIRUCHANUR- ABODE OF MAHAALAKSHMI_ శ్రీ మహాలక్ష్మి కొలువైన ఊరే తిరుచానూరు

Tiruchanur, 14 November 2017: From time immemorial as denoted in the Rig Veda, Tiruchanur stood for Goddess of Wealth, Mahalakshmi as the noun Tiruchana indicated wealth, progress, Profits and advantage to society.

In the past the village on outskirts of Tirupati also hosted the ashram of Sri Shakuni maharshi and as such was referred to town of Shakuni, which over period came to be corrupted into Srishukanur, and Tiruchanior.The meditation ground of Parashura, the grand father of Shakuni was Yogimallavaram (now known as Jogimallavaram) is also nearby. Puranas and legends indicate that Tiruchanoor existed as early as 5500 years ago in the last leg of Dwapara yugam.

Legends say that Mahalakshmi who came down from Vaikuntham had made Kolhapur as her first abode but had also made Tiruchanur as her second home on the request of Lord Venkateswara and is popular as Alavelu Manga (Alar Mel Manga) who was born in a lotus pond. Hence titled as Padmavathi. Lord Venkateswara had kept her in his left heart termed as Vyuha Lakshmi and returned to Tirumala, they say.

It is a well-known tradition that pilgrims to Tirumala should first have darsan of Tiruchanur Padmavathi temple. The goddess who stayed as Mahalakshmi at Kolhapur, Sri Padmavati at Narayanavanam, Aluvelu Manga at Tiruchanur and Vyuha Lakshmi in Lords abode at Tirumala is hailed as Kalpavalluwho granted boons for every one who came to her and surrendered


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ మహాలక్ష్మి కొలువైన ఊరే తిరుచానూరు

నవంబరు 14, తిరుపతి, 2017: తిరుచాన అనగా శ్రీకాంత, సిరులతల్లి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీ అనగా లాభం, ప్రయోజనం, సంపద, అభివృద్ధి, క్షేమం, యోగం అని ఆయా అర్థాల్లో ఋగ్వేదంలో ఉంది. ఆ జగన్మాత కొలువై ఉన్న ఊరే తిరుచాన ఊరు. అదే తిరుచానూరుగా మారింది. చాలాకాలం కిందట ఇక్కడ శ్రీ శుకమహర్షి ఆశ్రమం ఉండేది. ఈ కారణంగా దీన్ని ‘శ్రీశుకుని ఊరు’ అని పిలిచేవారు. కాలక్రమంలో ఈ పేరు ‘శ్రీశుకనూరు’, ‘తిరుచ్చుకనూరు’గా మారి ‘తిరుచానూరు’గా స్థిరపడింది. శ్రీ శుకమహర్షి తాత అయిన శ్రీ పరాశరుని తపోభూమి యోగిమల్లవరం(జోగిమల్లవరం) కూడా దీనికి సమీపంలోనే ఉంది. సుమారు 5500 సంవత్సరాల పూర్వం ద్వాపరయుగం చివరలో కలియుగం ప్రథమంలో తిరుచానూరు ఉన్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

భృగుమహర్షి పరీక్ష వల్ల శ్రీవైకుంఠం నుంచి అలిగి భూలోకానికి దిగివచ్చి కొల్హాపుర క్షేత్రం(మహారాష్ట్ర)లో కొలువైన శ్రీమహాలక్ష్మి అమ్మవారిని శ్రీవేంకటేశ్వరస్వామివారు తపస్సు చేసి ప్రార్థించాడు. స్వామివారి కోరిక మేరకు ఇక్కడ స్వర్ణముఖరీ నదీతీరంలోని శుకమహర్షి ఆశ్రమ ప్రాంతంలో పద్మసరోవరంలో ”అలమేలుమంగ”గా అమ్మవారు ఆవిర్భవించారు. అలర్‌మేల్‌ మంగ అనగా పద్మంపైన ప్రకాశించే దివ్యవనిత అని అర్థం. అందువల్లే ”పద్మావతి” అని మరో పేరు కూడా అమ్మవారికి సార్థకమైంది. ‘అలమేలుమంగ’గా అవతరించిన ఆ మహాలక్ష్మిని శ్రీ వేంకటేశ్వరుడు తన వక్ష:స్థలంపై ”వ్యూహలక్ష్మి”గా నిలుపుకుని వేంకటాచల క్షేత్రానికి తిరిగి వెళ్లాడు. అలమేలుమంగమ్మ అర్చామూర్తిగా కొలువై ఆరాధింపబడుతున్నందువల్ల తిరుచానూరు క్షేత్రం ‘అలమేలుమంగ పట్నం’గా కూడా ప్రసిద్ధికెక్కింది.

తిరుమల యాత్రికులు, భక్తులు తమ వేంకటాచల యాత్రలో ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి. తమ కోరికలను, ప్రార్థనలను స్వామివారికి తెలియజేసి వాటిని సఫలీకృతం చేసేలా చూడాలని అమ్మవారిని భక్తితో వేడుకోవాలి. కొల్హాపురంలో శ్రీమహాలక్ష్మిగా, నారాయణవనంలో శ్రీ పద్మావతిగా, తిరుచానూరులో అలమేలుమంగగా, తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని హృదయపద్మంలో వ్యూహలక్ష్మిగాను కొలువై భక్తుల పాలిటి కల్పవల్లిగా కోరికలను తీరుస్తోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.