TIRUMALA JEO LAUNCHES COMMON COLLECTION CENTRE(CCC) ON TRIAL RUN _ తిరుమలలో ప్రయోగ్మాత్మకంగా ”కామన్ కలెక్షన్” కేంద్రం ప్రారంభం
తిరుమలలో ప్రయోగ్మాత్మకంగా ”కామన్ కలెక్షన్” కేంద్రం ప్రారంభం
తిరుమల, 1 సెప్టెంబరు 2013 : తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తి.తి.దే ప్రధాన కల్యాణకట్టకు ఎదురుగా వున్న పాత అన్నప్రసాద భవనంలో కామన్ కలెక్షన్ కేంద్రాన్ని ఆదివారంనాడు ప్రయోగాత్మకంగా తి.తి.దే ప్రారంభించింది.
ప్రస్తుతం పి.ఎ.సి-4గా పిలువబడుతున్న ఈ భవనంలో సెల్‌ఫోన్ కౌంటర్‌లు, లగేజి కౌంటర్‌లు, పాదరక్షలు భద్రపరచే కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారంనాడు తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్‌లతో కూడి ప్రయోగాత్మకంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జె.ఇ.ఓ మాట్లాడుతూ తిరుమలలో వివిధ ప్రాంతాల్లో భక్తుల కొరకు తి.తి.దే సెల్‌ఫోన్ కౌంటర్‌లు, లగేజి కౌంటర్‌లు, పాదరక్షలు భద్రపరచే కౌంటర్‌లను ఏర్పాటు చేసిందన్నారు. అయితే దర్శనానంతరం భక్తులు ఈ కౌంటర్లను మళ్ళీ వెతుక్కోవలసిన అవసరం లేకుండా చేయడంలో భాగంగా నేరుగా పి.ఏ.సి-4 లో ఏర్పాటు చేసిన ‘కామన్ కలెక్షన్’ సెంటర్‌లో భద్రపరచిన తమ వస్తువులను తీసుకొని వెళ్లవచ్చునని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి నాలుగు కౌంటర్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు.
అందులో భాగంగా రూ.300, రూ.50, సుపథం దగ్గర ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్ కౌంటర్‌లో భద్రపరచిన సెల్‌ఫోన్‌లను భక్తులు దర్శనానంతరం పి.ఏ.సి-4 నందు ఏర్పాటుచేసిన కౌంటర్ నెం.5 నుండి తమ సెల్‌ఫోన్‌లను తిరిగి పొందవచ్చునని తెలిపారు. అదే విధంగా ఏ.టి.సి వైద్యశాల దగ్గర ఏర్పాటుచేసిన కౌంటర్లలో భద్రపరచిన సెల్‌ఫోన్‌లు, లగేజిలు, పాదరక్షలు మొదలగు వస్తువులు పి.ఏ.సి-4 లోని కౌంటర్ నెం.8 నుండి పొందవచ్చునన్నారు. ఇక వైకుంఠం-1 విజిలెన్సు విభాగం ఎదురుగా ఏర్పాటు చేసిన కౌంటర్లో భద్రపరచిన సెల్‌ఫోన్‌లు, లగేజిలు, పాదరక్షలు మొదలగు వస్తువులు పి.ఏ.సి-4 లోని కౌంటర్ నెం.9 నుండి పొందవచ్చునన్నారు. అదే విధంగా శంఖుమిట్ట కాటేజ్ జనరేటర్ వద్ద రూ.300 ప్రదేశంలో ఏర్పాటుచేసిన కౌంటర్‌లో భద్రపరచిన సెల్‌ఫోన్‌లు, లగేజిలు, పాదరక్షలు మొదలగు వస్తువులు పి.ఏ.సి-4 లోని కౌంటర్ నెం.10 నుండి పొందవచ్చునన్నారు.
తొలుత కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం ఇందులో ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకొని 15 రోజుల తరువాత పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కనుక భక్తులు తి.తి.దే భక్తుల కొరకు చేస్తున్న ఈ మార్పులను గమనించి సహకరించవలసినదిగా కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, ఆరోగ్యశాఖాధికారి శ్రీ వెంకటరమణ, ఇ.ఇ శ్రీ కృష్ణారెడ్డి, ఏ.వి.ఎస్.ఓలు శ్రీ సాయిగిరిధర్, శ్రీ మల్లిఖార్జున్, శ్రీ కోటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.