TIRUMALA NAMBI PIONEERED TEERTHA KAINKARYAM IN TIRUMALA_ శ్రీవారి తీర్థ కైంకర్యపరుడు శ్రీ తిరుమలనంబి : ఆచార్య కె.ఇ.దేవనాథన్
Tirumala, 19 August 2018: Acharya Tirumala Nambi pioneered Teertha Kainkaryam in Tirumala said,. former VC, SV Vedic University, Prof.KE Devanathan.
The 1045 Avatarotsavam of the great Sri Vaishnava Saint took place in Tirumala Nambi temple in Tirumala on Sunday.
Alwar Divya Prabandha Project co-ordinator Sri Chokkalingam, Tirumala Nambi descendant Sri Tatacharya were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి తీర్థ కైంకర్యపరుడు శ్రీ తిరుమలనంబి : ఆచార్య కె.ఇ.దేవనాథన్
ఆగస్టు 19, తిరుమల 2018: పాండిత్యం కన్నా భగవంతుడి సేవనే మిన్నగా భావించి శ్రీవారి తీర్థ కైంకర్యపరుడుగా శ్రీతిరుమలనంబి ప్రముఖ స్థానం పొందారని తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు కె.ఇ.దేవనాథన్ పేర్కొన్నారు. తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమల నంబి ఆలయ ప్రాంగణంలో 1045వ అవతార మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆచార్య కె.ఇ.దేవనాథన్ కీలకోపన్యాసం చేస్తూ శ్రీ తిరుమలనంబి స్వయాన శ్రీభగవద్ రామానుజులవారికి మేనమామ అన్నారు. తిరుపతిలోని అలిపిరిలో ఈయన 18 సార్లు రామాయణాన్ని శ్రీరామానుజులవారికి ఉపదేశం చేశారని చెప్పారు. ఇంతటి పాండిత్యం గల తిరుమలనంబి తన జీవితం మొత్తాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్నారని, ఈ కారణంగానే వారికి తాతాచార్య వంశీయులుగా పేరు వచ్చిందని వివరించారు.
అనంతరం శ్రీరాముని 16 గుణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 16 మంది పండితులతో సదస్సు నిర్వహించారు. ఇందులో బెంగళూరుకు చెందిన శ్రీపి.రామానుజాచారియర్ ”శ్రీరాముని వీరత్వం”, హైదరాబాద్‌కు చెందిన శ్రీ వి.కన్నన్ ”శ్రీరాముని కృతజ్ఞత”, తిరుపతికి చెందిన శ్రీ చక్రవర్తి రాఘవాచార్యులు ”శ్రీరామ-చరిత్రేన యుక్త:”, పుదుచ్చేరికి చెందిన ఆచార్య ధరణీధరాచార్ ”శ్రీరామ – ఆత్మవాన్”, తిరుపతికి చెందిన శ్రీ చక్రవర్తి రంగనాథాచార్య ”శ్రీరామ – అనసూయక:” అనే అంశాలపై ఉపన్యసించారు. అదేవిధంగా, శ్రీరామునికి సంబంధించిన గుణగణాలు, ధర్మజ్ఞ:, సత్యవాక్య:, దృఢవ్రత:, సర్వభూతహితేరతా:, విద్వాన్, సమర్థ:, ప్రియదర్శన:, జితక్రోధ:, ద్యుతిమాన్, సఫల రోషత్వం అంశాలపై పండితులు ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం, ఇతర అధికారులు, తాతాచార్య వంశీయులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.