TIRUPPAVAI TO ENHANCE SPIRITUAL FERVOUR-JEO HEALTH AND EDUCATION _ భక్తిభావాన్ని పెంచేందుకే ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలు : టిటిడి జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి
భక్తిభావాన్ని పెంచేందుకే ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలు : టిటిడి జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2020 డిసెంబరు 15: ప్రజల్లో భక్తిభావాన్ని పెంచేందుకే ధనుర్మాసంలో దేశవ్యాప్తంగా తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు తలపెట్టామని టిటిడి జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి తెలిపారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాయంత్రం తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈఓ మాట్లాడుతూ మాసాల్లో తాను మార్గశిరం లాంటి వాడినని సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశారని చెప్పారు. మార్గశిర మాసంలో విష్ణువును ఆరాధిస్తే సకలశుభాలు కలుగుతాయన్నారు. పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులందరూ తిరుప్పావై ప్రవచనాలు విని తరించాలని కోరారు.
కాగా, ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 141 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఆచార్య సి.రంగనాథన్, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు శ్రీ రంగరామానుజాచార్యులు తిరుప్పావై ప్రవచనాల పారాయణం చేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, శ్వేత సంచాలకులు డా. కె.రామాంజులరెడ్డి, ఆచార్య సి.రంగనాథన్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.