TTD EO REVIEWS ON THE DEVELOPMENT OF TIRUCHANOOR TEMPLE _ తిరుచానూరు ఆలయ అభివృద్ధిపై తితిదే ఈవో సమీక్ష
తిరుచానూరు ఆలయ అభివృద్ధిపై తితిదే ఈవో సమీక్ష
తిరుపతి, మార్చి 26, 2013: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టు సౌకర్యాలు కల్పించాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని అమ్మవారి ఆలయ ఆస్థానమండపంలో మంగళవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో క్యూకాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని వినియోగించడంపై స్పష్టత తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్వర్ణముఖి నది ఒడ్డున వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని సిద్ధం చేయాలని కోరారు. ఆస్థానమండం నుండి మెట్ల దారి వరకు నీడ కల్పించేందుకు శాశ్వతంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కోసం సరైన దిట్టం ఏర్పాటు చేయాలని డెప్యూటీ ఈవోను ఆదేశించారు. స్థానిక ఆలయాల్లో వేద పండితుల సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పుష్కరిణిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఇనుపగ్రిల్స్, నీటిశుద్ధియంత్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వరనీరాజనం కార్యక్రమాన్ని ఆస్థాన మండపంలో కాకుండా వాహనమండపం ముందు ఏర్పాటుచేస్తే పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించే అవకాశముంటుందని సూచించారు. పుస్తక విక్రయశాల, సమాచార కేంద్రం, శ్రీవారి సేవకులు 400 మంది ఉండేందుకు వీలుగా వసతి భవనం నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం అభివృద్ధి పనులపై త్వరలో నివేదిక రూపొందించాలని ఇంజినీరింగ్, ఆలయ అధికారులను ఆదేశించారు.
విజయనామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 2013-14 విజయనామ సంవత్సర తితిదే పంచాంగాన్ని ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తితిదే పంచాంగానికి ఎంతో పవిత్రత ఉందని, వీటిని తితిదే పుస్తక విక్రయశాలలు, కల్యాణమండపాల్లో విక్రయిస్తామని తెలిపారు. తితిదే ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి దీనిని రూపొందించారని ఈవో తెలిపారు.
ఈ సమీక్షలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారులు శ్రీ గోపాలకృష్ణ, శ్రీ రాజేంద్రప్రసాద్, శ్రీ బాలాజీ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.