TTD EO REVIEWS WITH TTD OFFICIALS ON ENSUING BRAHMOTSAVAMS 2013 _ బ్రహ్మోత్సవాలపై అధికారులతో తి.తి.దే ఇ.ఓ సమీక్ష
2013 బ్రహ్మోత్సవాలపై అధికారులతో తి.తి.దే ఇ.ఓ సమీక్ష
తిరుమల, 27 ఆగష్టు 2013 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 5వ తేది నుండి అక్టోబరు 13 వరకు జరుగనున్న నేపథ్యంలో మంగళవారంనాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ తి.తి.దే విభాగాధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో ఏవైనా పొరపాట్లు జరిగి వుంటే వాటిని పునఃసమీక్షించుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మరింత విజయవంతంగా నిర్వహించాలని ఆయన అధికారులను సూచించారు.
అనంతరం ఆయన తనను కలసిన మీడియాతో మాట్లాడుతూ ఈ సమీక్షా సమావేశంలో చర్చించిన పలు ముఖ్య అంశాలను గూర్చి తెలిపారు. వివరాలు….
1. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యార్థం కంట్రోల్‌రూమ్‌లో ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబరును అందివ్వడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఆన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అందుబాటులో ఉండి భక్తులకు సహాయసహకారాలందిస్తారన్నారు.
2. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో జరిగే కార్యక్రమాల మినిట్ టు మినిట్ పట్టికను ప్రతిఒక్క అధికారికి కరపత్రం రూపంలో అందించడం జరుగుతుందన్నారు. తద్వారా వారు తమతమ విధులను క్రమంతప్పకుండా నిర్వహించడానికి అనువుగా ఉంటుందని తెలిపారు.
3. అర్చకుల ఖాళీలు ఎక్కువగా ఉన్న కారణంగా బ్రహ్మోత్సవ వాహన మరియు ఇతర కైంకర్యాల సమయంలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉండడానికి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి సెప్టంబరు 25 నాటికల్లా డిప్యూటేషన్‌పై అర్చకులను తీసుకుంటామన్నారు. అదే విధంగా 10 శాతం అర్చకులను రిజర్వ్‌లో కూడా ఉంచుకోవటం జరుగుతుందన్నారు.
4. బ్రహ్మోత్సవాల్లో ఎవరికీ అసౌకర్యం కలుగకుండా ఉండడానికి వీలుగా దక్షిణమాడ వీధి వైశాలికృత పనులను తాత్కాలికంగా నిలిపివేయడమైనదన్నారు.
5. తిరుమలలో పేరుకపోయి వున్న చెత్తను తరలించడానికి వీలుగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త శ్రీ వై.ఎస్.మూర్తిగారి సహాయసహకారాలను కోరడమైనదన్నారు.
6. గరుడసేవనాడు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్నప్రసాద వితరణను కంపార్ట్మెంట్లలో కూడా విస్తరిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ రమణదీక్షితులు మాట్లాడుతూ ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు నూతన స్వర్ణరథం సిద్ధమై ఆరవరోజు యధాప్రకారం తిరుమాడ వీధులలో ఊరేగింపు జరుగుతుందన్నారు. అదే విధంగా అశ్వ, హంస, సింహ వాహనాలను సుందరీకరించడంలో భాగంగా నూతన బంగారు మకరతోరణం కూడా సిద్ధమౌతున్నదన్నారు. దయచేసి భక్తులు గరుడసేవనాడు స్వామివారి వాహనంపై నాణాలు విసిరివేయరాదని కోరారు.
ఈ కార్యక్రమంలో జె.ఇ.ఓలు శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, శ్రీ వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ సాలమన్ ఆరోగ్యరాజ్, ఎస్.పి (తిరుపతి అర్బన్) శ్రీ రాజశేఖర్‌బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ వినయ్‌చంద్, సి.వి.ఎస్.ఓ శ్రీ అశోక్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.